మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 17:43:42

గిరిజన సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

గిరిజన సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైద‌రాబాద్ : ఈ సంవత్సరంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. నూత‌న‌ సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, వికలాంగుల, వయో వృద్ధుల శాఖల అధికారులు, సిబ్బంది, బాలల హక్కుల పరిరక్షణ సమితి కమిషన్ సభ్యులు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. మంత్రుల నివాస ప్రాంగణంలోని క్వార్టర్‌లో కలిసి కేక్ కట్ చేసి కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

ఈ సంవత్సరంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికి మరింత కృషి చేయాలని, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీఎం ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ ఇన్నోవేషన్ స్కీమ్ కింద ఎక్కువ మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలని, డ్రైవర్ కమ్ ఓనర్, రూరల్ ట్రాన్స్ పోర్టేషన్, గిరి వికాసం కింద స్వయం ఉపాధి పెద్ద ఎత్తున కల్పించేలా ఎప్పటికప్పుడు లబ్దిదారులను గుర్తిస్తూ పథకాలను అమలు చేయాలన్నారు. గిరి బ్రాండ్‌కు 2020లో మంచి పేరు వచ్చిందని, దీనిని మరింత పెంచేలా గిరిజన సహకార సంస్థ పనిచేయాలని, మరిన్ని ఉత్పత్తులను గిరి బ్రాండ్ తో మార్కెట్ లోకి తీసుకొచ్చి లాభాల బాటలో జీసీసీని నడిపించాలన్నారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖలు మనసు పెట్టి చేయాల్సినవేన‌ని కాబట్టి ఈ శాఖ అధికారులు మహిళలు, పిల్లల సమస్యలను సావధానంగా అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. మహిళలు, పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమాజంలో మహిళలు, పిల్లలు, గిరిజనులు సగానికి పైగా ఉన్నందున ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో మరింత బాధ్యతగా ఉండాలన్నారు. 

ఇక బాలల హక్కుల కమిషన్ తమ హక్కులను కాపాడుతుందని, కమిషన్ దృష్టికి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని మరింత పెంచాలని కమిషన్ సభ్యులకు సూచించారు. మనకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు ఆ ఫిర్యాదుదారులకు జరిగిన న్యాయం ఇతరులకు కూడా తెలిసినప్పుడు కమిషన్ పట్ల బాధితులకు ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుందన్నారు. చిన్న సంఘటన జరిగినా వెంటనే అక్కడ కమిషన్ ఉండాలని, దాని పూర్వాపరాలు విచారించి, దోషులకు కఠిన శిక్షలు పడే వరకు కేసును ఫాలో అప్ చేయాలని, తద్వారా కమిషన్ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలలో విశ్వాసాన్ని పెంచాలన్నారు. 

ఈ కార్య‌క్ర‌మంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టియానా జడ్ చోంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు, వికలాంగుల, జువెనైల్ శాఖ సంచాలకులు శైలజా, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులు సర్వేశ్వర్ రెడ్డి, సముజ్వల, విజయలక్ష్మీ, డాక్టర్ నికోలస్, శంకర్ రావు, లక్ష్మీ ప్రసాద్, ఏకాంబరం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నుంచి లక్ష్మీ, నిర్మల, శారదా, గిరిజ, సునంద, ఝాన్సీ, పద్మజా, స్వరూప, కమిషన్ సభ్యులు అంజన్ రావు, బృందాదర్, శోభారాణి,  అపర్ణ, దేవయ్య, రాగజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.logo