బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:20:00

కరోనా కట్టడికి మరిన్ని చర్యలు

కరోనా కట్టడికి మరిన్ని చర్యలు

  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు అసౌకర్యం కలుగొద్దు
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ పొడిగింపు, కొన్ని సడలింపుల నేపథ్యంలో కరోనా కట్టడికి క్షేత్రస్థాయిలో మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై వైద్యారోగ్య పలు విభాగాధిపతులతో శనివారం బీఆర్కే భవన్‌లో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాపై గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న డయాలసిస్‌, క్యాన్సర్‌, టీబీ రోగులు చికిత్స పొందేందుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని చెప్పారు. 

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత లేకుండా చూడాలని, రక్తం యూనిట్ల పంపిణీ విషయంలో జాగ్రత్త వహించాలని, తలసేమియా రోగులకు సకాలంలో రక్తం అందేలా దృష్టి పెట్టాలన్నారు. గాంధీలో ఐసీయూను మరింత బలోపేతం చేయాలని, కొత్తగా వైద్యులను నియమించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. లక్ష కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రైవేట్‌ దవాఖానలు, క్లినిక్‌లు తెరుచుకుంటున్న సందర్భంలో అందులో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది, రోగులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్య సంఘాలతో చర్చించాలని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు సూచించాలని ఆదేశించారు. 

దవాఖానల్లో, గ్రామస్థాయిలో వైరస్‌ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేందుకు సోమవారం జిల్లా వైద్యశాఖ అధికారులు, సూపరింటెండెంట్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. సమావేశంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, టీసాక్స్‌ పీడీ ప్రీతిమీనా, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌ వీసీ కరుణాకర్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo