ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 01:04:23

మూడు రోజులు ఓ మోస్తరు వానలు

మూడు రోజులు ఓ మోస్తరు వానలు

  • నేడు పలుచోట్ల భారీగా..విస్తరిస్తున్న రుతుపవనం
  • పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా..
  • అత్యధికంగా రామగుండంలో 6.6 సెంటీమీటర్లు 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అక్కడక్కడా రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంతోపాటు తిమ్మాపూర్‌, శంకరపట్నం, మానకొండూర్‌, వీణవంక, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర తదితర మండలాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. చిగురుమామిడి, గన్నేరువరం, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి మండలాల్లో ఓ మోస్తరు వాన పడింది. కరీంనగర్‌లో 0.7 సెంటీ మీటర్ల వర్ష్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 6.6 సెంటీ మీటర్ల వర్షం కురవగా.. జిల్లా సగటు 3.5 సెంటీమీటర్ల వర్ష్షపాతం రికార్డయింది. జగిత్యాల జిల్లాలో సగటున 3.5 సెంటీమీటర్ల వర్షం కురవగా రాయికల్‌ మండలంలో అత్యధికంగా 6.4 సెంటీమీటర్లు నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ, రుద్రంగి, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, కోనరావుపేట మండలాల్లో భారీ వర్షం కురవగా జిల్లా సగటు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంతోపాటు కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది.

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, తిరుమలగిరి(సాగర్‌), తుంగుతుర్తి, సూర్యాపేట, చివ్వెంల మండలాల్లో ఓ మోస్తరు, నకిరేకల్‌లో భారీగా పడింది, ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో గాలిదుమారంతోపాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వానపడింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంతోపాటు రవీంద్రనగర్‌,  కర్జెల్లి తదితర గ్రామాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఇక్కడ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో..

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు శివారులోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 9 వరకు అత్యధికంగా ఘాన్సీ బజార్‌లో 2.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు చురుకుగా కదులుతుండటంతో రాగల ఐదు రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం అధికారులు వెల్లడించారు. 
logo