శనివారం 06 జూన్ 2020
Telangana - May 07, 2020 , 02:30:53

రోగిని కలవకుండానే పర్యవేక్షణ

రోగిని కలవకుండానే పర్యవేక్షణ

  • మోనాల్‌ పరికరం ఆవిష్కరణ
  • రూపొందించిన ఈసీఐఎల్‌, ఎయిమ్స్‌

చర్లపల్లి: కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎక్కడినుంచైనా పర్యవేక్షించే ఓ వినూత్న పరికరాన్ని హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌, రిషికేష్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) సహకారంతో రూపొందించింది. ఈ పరికరానికి జార్ఖండ్‌ రాష్ట్ర పక్షి ‘మోనాల్‌' అని పేరుపెట్టారు. ఈ పరికరం ద్వారా స్వీయ నిర్బంధం లేదా దవాఖానలో ఉన్న రోగి లక్షణాలను 24 గంటలపాటు తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలకు అనుగుణంగా చికిత్సను సిఫారసు చేయవచ్చు. ఈసీఐఎల్‌ ప్రతినిధులు బుధవారం ఈ వివరాలను వెల్లడించారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ పద్మశ్రీ ప్రొఫెసర్‌ రవికాంత్‌ పర్యవేక్షణలో ప్రాజెక్ట్‌ ప్రిన్సిపాల్‌ లీడ్‌ డాక్టర్‌ మోహిత్‌ తాయల్‌ ఆధ్వర్యంలో ఈసీఐఎల్‌ సంస్థ ఈ పరికరాన్ని రూపొందించిందని తెలిపారు. మోనాల్‌ పరికరాన్ని కరోనా రోగి చేతికి అమర్చడంతో రిమోట్‌ ద్వారా ఆ వ్యక్తి లక్షణాలు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో ఆక్సిజన్‌ శాతం, పల్స్‌రేటు, శ్వాసక్రియ రేట్‌లను రిమోట్‌ ద్వారా ఎక్కడినుంచైనా మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. తద్వారా రోగులకయ్యే పీపీఈ కిట్ల ఖర్చును తగ్గించవచ్చని, వైద్యులు, వైద్య సిబ్బందిని వైరస్‌ బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. రోగికి అమర్చిన పరికరంలోని వివరాలు బ్లూటూత్‌, జీఎస్‌ఎం సిమ్‌ ద్వారా లేక ఇంటర్నెట్‌ ద్వారా మరో పరికరానికి (ఫోన్‌, కంప్యూటర్‌) చేరుతాయని వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఈసీఐఎల్‌ రూపొందించిందని తెలిపారు. ఈ పరికరాన్ని ఎయిమ్స్‌ సంస్థ రిషికేష్‌ వద్ద కొవిడ్‌-19 రోగులపై పరీక్షించగా విజయవంతంగా పనిచేసిందన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ ఈసీఐఎల్‌ సంస్థ, ఎయిమ్స్‌ అధికారులు రూపొందించిన మోనాల్‌ సిస్టమ్‌ పనితీరును పరిశీలించి అభినందించారని ప్రతినిధులు పేర్కొన్నారు. 


logo