సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 19:50:21

క‌రోనా క‌రుణ‌తో 33 ఏండ్ల త‌ర్వాత 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

క‌రోనా క‌రుణ‌తో 33 ఏండ్ల త‌ర్వాత 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌

హైద‌రాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా బాధలను సృష్టిస్తున్న‌ప్ప‌టికీ ఓ హైద‌రాబాదీని మాత్రం ఆశీర్వ‌దించింది. మ‌హ్మ‌ద్ నూరుద్దీన్‌(51) అనే వ్య‌క్తి గత 33 సంవత్సరాలుగా ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ప‌రీక్ష రాసిన‌ ప్ర‌తీసారి విఫ‌ల‌మౌతూనే ఉన్నాడు. కాగా ఈసారి క‌రోనా ఆశీర్వాదంతో 10 వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అదీ ప‌రీక్ష రాయ‌కుండానే. 

 ముషీరాబాద్ ప్రాంతంలోని అంజుమాన్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థి నూరుద్దీన్. 1987 లో మొద‌టిసారిగా ఎస్ఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యాడు. అన్ని పేపర్లను క్లియర్ చేసిన‌ప్ప‌టికీ ఇంగ్లీష్ మాత్రం మిగిలిపోయింది. ఇదే అత‌నికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రతి ఏడాది పరీక్ష రాయ‌డం పాస్ మార్కుల‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఆగిపోవ‌డం జ‌రుగుతూఉండేది. 32 లేదా 33 మార్కులు వ‌చ్చి ఫెయిల్ అవుతుండేవాడు. కాని వద‌ల‌కుండా ప్ర‌య‌త్నించి పాస్ కావ‌డానికే నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పాడు. 

ఈ సంవత్సరం సైతం ప‌రీక్ష రాసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే ఫీజు చెల్లించే చివ‌రితేదీని మిస్ అయ్యాడు. దీంతో ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది. దీనివ‌ల్ల అతను మొత్తం ఆరు పేపర్లను మళ్ళీ వ్రాయవలసి వచ్చింది. ప‌రీక్షలు పాస్ అయ్యేందుకు తాను చాలా క‌ష్ట‌ప‌డ్డ‌ట్లు తెలిపాడు. చ‌దువులో త‌న‌కు బి.కామ్ చ‌దివే కుమార్తె స‌హాయం చేసిన‌ట్లు చెప్పాడు. 

కోవిడ్ -19 పరిస్థితి కారణంగా విద్యాశాఖ ఈసారి పరీక్షలు నిర్వహించలేదు. అభ్యర్థులందరూ ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో నూరుద్దీన్  సైతం ప‌ది గ‌ట్టెక్కాడు. మొత్తంమీద ఎస్‌ఎస్‌సి ఉత్తీర్ణత సాధించినందుకు త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌న్నాడు. కానీ ఇది చాలా కాలం క్రితమే జరిగి ఉండాల్సిందని అభిప్రాయ‌ప‌డ్డాడు. 

అప్ప‌టి రోజుల‌ను ఆయ‌న గుర్తుచేసుకుంటూ రైల్వే, పోలీసు లేదా ఇతర విభాగాలలో ఏదైనా ఉద్యోగం సంపాదించాలంటే ఆ రోజుల్లో ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ప‌ది ఫెయిల్ కావ‌డంతో 1990 నుండి తాను చ‌దివిన అదే పాఠ‌శాల‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న‌ట్లు తెలిపాడు. ప్రస్తుతం 8,000 రూపాయల జీతం తీసుకుంటున్నాడు. ప్ర‌తీ ఏడాది ప‌రీక్ష‌లు రాసేందుకు వెళ్లగా కొంద‌మంది కామెంట్లు చేసేవార‌ని కానీ తానెప్పుడు వాటిని ప‌ట్టించుకోలేద‌న్నాడు. ప‌రీక్ష పాస్ అయేందుకే ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలిపాడు. 

1994 లో ఇదారా-ఎ-అడాబియాట్-ఎ-ఉర్దూ లేదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఉర్దూ లిటరేచర్ నిర్వహించిన ఇంటర్మీడియట్ (10 + 2) కు సమానమైన 'ఫాజిల్' పరీక్షను వ్రాసి ఉత్తీర్ణత సాధించినట్లు నూరుద్దీన్ చెప్పాడు. అదేవిధంగా జామియా నిజామియాలో ప‌లు కోర్సులను కూడా పూర్తి చేసిన‌ట్లు తెలిపాడు. అత్తాపూర్ ప్రాంతంలో పేద పిల్ల‌ల కోసం అరబిక్ మదర్సాను నడుపుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. నూరుద్దీన్‌కు మానసిక విక‌లాంగుడైన కొడుకుతో పాటు న‌లుగురు సంతానం ఉన్నారు. 


logo