హైదరాబాద్ : మొఘల్‌పుర సీఐతో అమర్యదగా మాట్లాడిన మహ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. సీఐ యూనిఫాం విడిపిస్తానని, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నావని చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి తెలిపారు. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై గతంలో అనేక కేసులతో పాటు రౌడీ షీటు కూడా నమోదైంది. వేర్పాటు వ్యాఖ్యలు చేసి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను బెదిరిస్తూ అమర్యాదగా మాట్లాడిన వ్యక్తిమీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు.