శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 02:26:35

కరెంటుపై కమలనాథుల దుబ్బాక పాచిక

కరెంటుపై కమలనాథుల దుబ్బాక పాచిక

  • విద్యుత్‌ బిల్లుకు జనామోదం ఉందని డప్పుకొట్టేకునే యత్నాల్లో భాజపా
  • రాష్ట్ర అభివృద్ధిని అస్థిరపర్చే యత్నం.. కాషాయ దళం భయంకర పన్నాగం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో ఘన విజయంతో గులాబీసేనకు సీటు పదిలంగా ఉంటుంది! ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో వరుస ఎన్నికల్లో అప్రతిహతంగా దూసుకుపోతున్న కారు.. మరో విజయంతో మరింత జోరందుకుంటుంది! లభించిన కొత్త స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతుంది! ఇంతకుమించి టీఆర్‌ఎస్‌కున్న అజెండా ఏమీలేదు! కానీ.. ఈ సీటులో గెలువాలని ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు.. ప్రత్యేకించి బీజేపీ.. భయంకరమైన కుట్రతో పావులు కదుపుతున్నది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకు నష్టంచేకూర్చే చట్టాల అమలుకు ప్రజామోదం ఉన్నదని చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే కుటిల పన్నాగాలతో సిద్ధమైందని విశ్లేషకులు అంటున్నారు. రక్కసిలాంటి కరెంటు బిల్లు ఆమోదంపై కేంద్రం నానా తంటాలు పడుతున్నది. తెలంగాణ, కేరళ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర సహా 11 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత సీఎంలు ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించారు. కేంద్ర విద్యుత్‌ బిల్లును శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తోసిపుచ్చారు. రాష్ట్రప్రయోజనాలకు, ప్రత్యేకించి రైతు ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని కరాఖండిగా చెప్పారు. అప్పటి నుంచి బీజేపీ కంట్లో కత్తులు పెట్టుకున్నది. దుబ్బాక ఉప ఎన్నికలో మసిబూసి మారేడు కాయ చేస్తే కేంద్ర విద్యుత్‌ బిల్లుకు తెలంగాణ ప్రజలు మద్దతు తెలిపారని డప్పుకొట్టుకోవాలని ఉబలాటపడుతున్నదని పలువురు పరిశీలకులు అంటున్నారు.

తెలంగాణ భుజంపై తుపాకీ పెట్టి..

తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఉద్యమ ఫలాన్ని విఫలప్రయోగంగా చూపాలనే దుగ్ధ అన్ని ప్రతిపక్ష పార్టీల్లోనూ కనిపించింది. కానీ.. ఉద్యమ చైతన్యం నరనరాన నింపుకొన్న తెలంగాణ ప్రజలు.. ఆ కుట్రలను ఎప్పటికప్పుడు తుత్తునియలు చేస్తూ వచ్చారు. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికలో మళ్లీ పన్నాగాలు పన్నుతున్న బీజేపీ.. నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర నుంచి చేయని హంగామాలేదు. డబ్బులతో, చీరెలు పంచుతూ దొరికిపోయిన సందర్భాలు అనేకం. బీజేపీ ఇన్ని పాట్లు పడుతున్నది ఒక్క సీటు దక్కించుకోవడం కోసమే కాదని, రైతులకు, సామాన్య ప్రజలకు పెను భారంగా మారే విద్యుత్‌ బిల్లుకు తెలంగాణ ఆమోదం ఉన్నదని చెప్పుకోవడమే వారి ఉద్దేశమని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చేందుకు సిద్ధమవుతున్నదని అంటున్నారు. 

మన వేలితో మన కంటినే పొడుసుకుందామా?

మంది మాటలిని మనుంబోతే.. మల్ల్లొచ్చేసరికి ఇల్లంత ఆగమైందని సామెత! ఆరున్నరేండ్లుగా కంటికి రెప్పలా కాపాడుకొంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కాదని.. దుబ్బాక ఓటరు ఏమరుపాటున ఉంటే ఇదే గతైతదని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ‘తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇయ్యాలన్నా ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కాలడ్డంపెట్టే రోజులొస్తయి. మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లయితది’ అని స్పష్టంచేస్తున్నారు.

మోదీకి ఆదినుంచి తెలంగాణ చులకనే

ప్రధాని మోదీ మొదటి నుంచి తెలంగాణ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. పోరాటాలు, త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సాధించుకుంటే.. ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ హైదరాబాద్‌ నడిబొడ్డున నిందించే దుస్సాహసానికి ఒడిగట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చులకనచేసి పారేశారు. ఏకపక్షంగా తెలంగాణ మండలాలను గుంజుకొని, ఏపీకి కట్టబెట్టారు. తెలంగాణను పొగుడుతూనే.. కనీస ఆర్థిక సహాయం అందకుండా నాన్చారు. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించిన మిషన్‌ భగీరథ ప్రారంభానికి వచ్చిన మోదీ.. కనీసం ఆ పథకానికి రూపాయి ఇవ్వలేదు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫార్సు చేస్తే పట్టించుకోలేదు. ఇదేదో మామూలుగా సాగిపోయినది కాదు.. తెలంగాణ పురోభివృద్ధి సాధించకుండా, ఎదిగేందుకు ఊతమివ్వకుండా ఉద్దేశపూర్వకంగా నడిపించిన కుట్రేనని తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ఘోషిస్తూనే ఉన్నది. తెలంగాణకు అండగా నిలువని బీజేపీ.. ఇప్పుడు తన విద్యుత్‌ బిల్లులకు జనామోదం ముద్ర వేయించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను సహించాల్సిన అవసరమేంటన్నదే ప్రశ్న. ఇదేదో దుబ్బాక ఎమ్మెల్యేను మాత్రమే ఎన్నుకునే బ్యాలెట్‌ పోరు కాదు. ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న తెలంగాణ రైతు మెడకు కరెంటు మీటరు రూపంలో ఉరి బిగించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగే బదులిచ్చే ఎన్నిక. 

ఊరూరి చైతన్యం ఉరితాళ్లకు పోతదా?

చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది నానుడి. కానీ.. బీజేపీ కోరలు సాచిన కొండచిలువలాంటిది. ఒక్కసారి పట్టుకుంటే.. చుట్టుముట్టి.. చుట్టచుట్టి అమాంతం మింగేస్తుంది. దుబ్బాకను గెలువడం అసాధ్యమని తెలిసీ.. మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్ర, జాతీయ నాయకత్వాన్ని బీజేపీ మోహరించింది. ఈ నేపథ్యంలో ‘ప్రతి ఇంటా ఒక వీరుడు ఒరిగిన కథలు..’గా రాసుకున్న దుబ్బాక పోరుచైతన్యం ఇవ్వాళ మరోసారి తన చరిత్రను తాను రాయాల్సిన బాధ్యత ముందుకు వచ్చింది. కరడుగట్టిన బీజేపీ ఛాందసవాద కుట్రకత్తులకు చరమగీతం పాడాలి. ‘రాజకీయంగా కూలదోయటం..ఆర్థికంగా కొల్లగొట్టడం’ అనే ద్వంద్వ నీతితో ముందుకు సాగుతున్న బీజేపీ కత్తుల కోలాటాన్ని బలంగా తిప్పికొట్టాల్సిన అనివార్యత దుబ్బాక ముందున్నది.