గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 02:10:36

‘షీ టాయిలెట్స్‌' భేష్‌

‘షీ టాయిలెట్స్‌' భేష్‌

  • నారాయణపేట జిల్లా కలెక్టర్‌కు కేంద్రమంత్రి షెకావత్‌ అభినందన
  • కోస్గిలో మంత్రి కేటీఆర్‌ సూచనతో ప్రారంభం 
  • త్వరలో మరో రెండు షీ టాయిలెట్స్‌ ఏర్పాటు
  • మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

మహబూబ్‌ నగర్‌ ప్రతినిధి: నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ప్రారంభమైన షీ టాయ్‌లెట్స్‌ కేంద్ర జల్‌శక్తి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రశంసలందుకున్నాయి. కలెక్టర్‌ దాసరి హరిచందన మదిలోవచ్చిన ఆలోచనతో పాత ఆర్టీసీ బస్సు షీ టాయ్‌లెట్‌గా రూపుదిద్దుకొన్నది. ఓ ఫిట్‌నెస్‌లేని బస్సును పుణెకు పంపి టాయ్‌లెట్‌కు అనుగుణంగా తయారుచేయించారు. ఇందులో ఒక టీ స్టాల్‌ను కూడా ఏర్పాటుచేయడం విశేషం. దీనిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ నెల 20న ప్రారంభించారు. పూర్తిగా సౌరశక్తితో నడిచే దీనికి ఓ సహాయకురాలిని సైతం నియమించారు. పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7వరకు అందుబాటులో ఉంచుతున్నారు. అత్యంత భద్రత మధ్య పనిచేసే ఈ టాయ్‌లెట్స్‌ను పూర్తిగా బయో డైజెస్టర్స్‌తో దీన్ని నిర్వహిస్తున్నారు.

కోస్గి పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దీని నిర్వహణ కొనసాగుతున్నదని కలెక్టర్‌ వివరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు మొబైల్‌ షీ టాయిలెట్లను కోస్గిలో ప్రారంభించినట్టు కలెక్టర్‌ హరిచందన తెలిపారు. ఈ ఆలోచనను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ట్విట్టర్‌ వేదికగా బుధవారం మెచ్చుకున్నారు. కలెక్టర్‌ హరిచందనను అభినందించారు. ఇదిలా ఉండగా మరో రెండు షీ టాయ్‌లెట్స్‌ను పర్యాటక శాఖ పరిధిలో అందుబాటులోకి తేనున్నట్టు రాష్ట్ర ఆబ్కారీశాఖ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రెండు బస్సులను ఇదేతరహాలో మార్చేందుకు ఆర్డర్‌ ఇచ్చినట్టు, పది రోజుల్లో మహబూబ్‌నగర్‌లో ఇవి అందుబాటులోకి రానున్నట్టు పేర్కొన్నారు.logo