శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 00:41:28

గ్రామాలకు మొబైల్‌ ఐసీయూ

గ్రామాలకు మొబైల్‌ ఐసీయూ

  • ప్రారంభించిన మంత్రి ఈటల 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతాలవారికి అత్యవసర సందర్భాల్లో వెంటిలేటర్‌, ఐసీయూ సేవలను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంచార వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చేవారిలో కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో గ్రామాల్లో వైరస్‌ బారిన పడ్డవారి నుంచి నమూనాలు సేకరించడంతోపాటు వెంటిలేటర్‌ సేవలను అందించేందుకు ఈ సంచార వాహనంలో ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రత్యేక వాహనాన్ని గురువారం వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తీవ్ర అనారోగ్య సమస్యలతో అత్యవసరంగా ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి ఉన్నవారికి ఉపయోగపడేలా ఈ వాహనాన్ని రూపొందించినట్టు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో అనేకమంది దాతలు ముందుకు వచ్చి అనేక వైద్య పరికరాలు అందిస్తూ దాతృత్వం చాటుకుంటున్నారని అభినందించారు. మైక్రాన్‌ కంపెనీ 100 వెంటిలేటర్లు అందించేందుకు ముందుకు వచ్చిందని, దీంతో ప్రభుత్వానికి 400 వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటితోపాటు మరో వెయ్యి వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ఈ ప్రత్యేక మొబైల్‌ ఐసీయూ సేవలు మొదట నిజామాబాద్‌లోని ఇందూరు క్యాన్సర్‌ దవాఖాన పరిధిలో అందుబాటులోకి రానున్నాయి. మరో నాలుగు వాహనాలను కూడా త్వరలోనే మారుమూల పల్లెలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. ఈ ప్రత్యేక వాహనంలో రెండు వెంటిలేటర్లు, మూడు బెడ్లతోపాటు ఐసీయూ వసతులున్నాయి. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు, కరోనా లక్షణాలున్నవారి వద్ద నుంచి స్వాబ్‌ నమూనాలను సేకరించేందుకు తగిన ఏర్పాట్లున్నాయి. ఎక్స్‌రే, టెలిమెడిసిన్‌, మామ్మోగ్రఫీ పరికరాలు కూడా ఉన్నాయి. కార్యక్రమంలో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ చిన్నబాబు, వ్యవస్థాపక సభ్యుడు రాజీవ్‌లాల్‌, దాత హైదరాబాద్‌ ట్రిప్‌ఐటీ ప్రొఫెసర్‌ రమేశ్‌ లోగనాథన్‌ తదితరులు పాల్గొన్నారు.logo