శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:00

చార్మినార్‌ వద్ద భోగి వేడుకలు

 చార్మినార్‌ వద్ద భోగి వేడుకలు

  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహణ
  • మంటలు వెలిగించిన అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

చార్మినార్‌, జనవరి 13: భోగుళ్లో భోగుళ్లో.. భోగభాగ్యాల భోగుల్లో.. అంటూ రైతన్నలు ఎంతో ఇష్టంగా పాడుకొనే సంప్రదాయ గీతానికి అనుగుణంగా డూడూ బసవన్నలు నాట్యమాడుతూ అలరించాయి. చారిత్రక చార్మినార్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన భోగిమంటలను ఆ సంస్థ అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు లోగిళ్లలో సంతోషాలను నింపే పెద్ద పండుగ సంక్రాంతి అని తెలిపారు. పాడిపంటలు చేతికి అంది రైతన్నల కష్టానికి దక్కిన ఫలితంగా సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరి జీవితాల్లో భోగభాగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి, ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌, మహిళా అధ్యక్షురాలు మంచాల వరలక్ష్మి, నగర అధ్యక్షుడు ప్రశాంత్‌, పాతనగర జాగృతి కోకన్వీనర్‌ రాధాకృష్ణ, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo