సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:29:51

మాంద్యంలోనూ అభివృద్ధి

మాంద్యంలోనూ అభివృద్ధి
  • ఈ ఘనత సీఎం కేసీఆర్‌దే
  • కేంద్రం అనాలోచిత నిర్ణయాలవల్లే మాంద్యం
  • శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చలో సభ్యులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశమంతా ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లే విధంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ ప్రశంసించారు. శాసనమండలిలో గురువారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. గత 60 ఏండ్లలో ఏ ప్రభుత్వమూ ఎంబీసీలను పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈసారి ఎంబీసీలకు రూ.500 కోట్లను కేటాయించిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తేరా చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలవల్లే దేశంలో ఆర్థికమాంద్యం నెలకొన్నదని విరుచుకుపడ్డారు. 2007-08లో ఇదేవిధంగా ఆర్థిక మాంద్యం ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. సింగపూర్‌ వంటి చిన్న దేశం ఆర్థికంగా వృద్ధి చెందడానికి అక్కడున్న అధినాయకుడి నిర్ణయాలే ప్రధాన కారణమని, ఉన్నత లక్ష్యాలున్న నాయకుడు మన రాష్ర్టానికి ఉండటంతో..  తెలంగాణ కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు.


సీఎం కేసీఆర్‌కు పూర్తి అవగాహన 

రాష్ర్టాభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నదని డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కల్యాణలక్ష్మి పథకం వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలు నిలిచిపోయాయని చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, మత్స్యకారులకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. ఇన్ని విశిష్టమైన పథకాలు అమలవుతూ, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే.. ‘ఇది రైతు రాజ్యం, ప్రజారాజ్యం’గా అనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.


హ్యాపీనెస్‌ కార్యక్రమాలతో మెరుగైన ఫలితాలు 

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో హ్యాపీనెస్‌ కార్యక్రమాల్ని నిర్వహించడం వల్ల అక్కడి విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలొచ్చాయని కాటేపల్లి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకూ.. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలుచేశారని చెప్పారు. అక్కడ తొమ్మిదో తరగతి నుంచే ఉద్యోగాల్ని సృష్టించే స్థాయికి ఎదిగేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. 2003 డీఎస్సీ ఉత్తీర్ణులైనవారికి పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అభ్యర్థించారు. గురుకుల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని చెప్పారు. 


ఎయిడెడ్‌ స్కూళ్ల అభివృద్ధి..

రాష్ట్రంలో ఎయిడెడ్‌ స్కూళ్లను అభివృద్ధి చేయాలని టీచర్స్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం త్వరగా పూర్తిచేయాలని, సాగర్‌ వరదకాలువకు అదనపు నిధుల్ని వెచ్చించి, త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. మరో సభ్యుడు నారదాసు లక్ష్మణరావు చర్చలో పాల్గొంటూ రాష్ట్రంలో తొమ్మిదివర్గాలకు పెన్షన్లు ఇస్తున్నారని, ఇందుకోసం 40లక్షల మందికి రూ.40 కోట్లను కేటాయించారని తెలిపారు. బడ్జెట్‌ సంక్షేమానికి అద్దం పడుతున్నదన్నారు.


logo