ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:26:48

కరోనా వ్యాప్తికి బీజేపీనే కారణం

కరోనా వ్యాప్తికి బీజేపీనే కారణం

  • చైనా.. బీజేపీ తీరు ఒక్కటే
  • తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి
  • చేతనైతే కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించాలి
  • ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌, ఎంపీ వెంకటేశ్‌ సవాల్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో కరోనా వ్యాప్తికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ ఆరోపించారు. ప్రపంచంలో కరోనా విస్తరిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ రవాణాను నిలుపలేదని విమర్శించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో భానుప్రసాద్‌ మీడియా తో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మరని, కేంద్రంలోని వారి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఏం చేసిందోచెప్తే ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ కోసం ఎలాంటి త్యా గాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో తాము వివరిస్తామని చెప్పారు. కరోనా విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాటలు ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. 

దేశంలో, రాష్ర్టాల్లో కరో నా వ్యాప్తి, మరణాల లెక్కలు జాతీయ అధ్యక్షుడికి తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. కరోనా మరణాల శాతం జాతీయ స్థాయిలో 3.26 శాతం ఉంటే.. తెలంగాణలో 2.26 శాతం ఉన్నదని చెప్పారు.  కరోనా కట్టడి, చికిత్స, పరీక్షల నిర్వహణ విషయంలో కేంద్రానికి నిర్దిష్టమైన అవగాహన లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం చెప్పేవరకు కేంద్రానికి మ ర్కజ్‌ వ్యవహారం తెలియదని గుర్తుచేశారు. కేంద్రం ఆధీనంలో ఐసీఎమ్మార్‌ ఒక మాట చెప్తే.. ఆయుష్‌ విభాగం మరోమాట చెప్తూ.. రాష్ర్టాలను అయోమయానికి గురి చేస్తున్నాయని విమర్శించారు. కరోనా టెస్టుల కోసం చైనా కిట్లను వినియోగించకూడదని చెప్పి రోజుకో దేశం నుంచి కిట్లు తెప్పించి గందరగోళానికి గురి చేసింది కేంద్రం కాదా? అని భానుప్రసాద్‌ ప్రశ్నించారు. కరోనా విషయంలో ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారుపై విమర్శలుచేయడం వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. 

రాజకీయాలకు ఇది సమయమా?

ఓ వైపు సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు, మరోవైపు దేశమంతా కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ నేతలు రాజకీయాలుచేయడం విచిత్రంగా ఉన్నదని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు. ‘రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయమా? ఓ వైపు సీఎం కేసీఆర్‌ రాజకీయాలు చేయకుండా దే శరక్షణ కోసం సమిష్టిగా నిలువాలని చెప్తూ.. మోదీకి అండగా ఉన్నామని మాట్లాడుతుం టే.. మరోవైపు బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నరు. మీ మైండ్‌ ఏమైంది?’ అని ధ్వజమెత్తారు. దేశ సరిహద్దుల్లో చైనా అనుసరిస్తున్న తీరు.. దేశంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఒక్కటిగా కనిపిస్తున్నదన్నదని విమర్శించారు. 

‘మీకు తెలియకుం టే మేం అర్థమయ్యేలా చెబుతాం రండి.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు ప్రచారంచేస్తే సహించేది లేదు’ అని వెంకటేశ్‌ హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎటువంటి చర్చకైనా తాము సిద్ధమని, బీజేపీ నాయకులు చర్చకు వస్తారా అని సవాల్‌ చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌ పాలనను హర్షిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. ‘చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హో దా కల్పించాలని డిమాండ్‌చేస్తున్నాం. దీనికోసం బీజేపీ నేతలు ఎందుకు ప్రయత్నం చేయరు? రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు బాధ్యత లేదా?’ అని నిలదీశారు.  మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించిన నీతి ఆయోగ్‌.. ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్రానికి సూచించిందని గుర్తుచేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్‌కు వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. 


logo