శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 15:54:27

కుమ్రం భీంకు నివాళులర్పించిన ప్రముఖులు

కుమ్రం భీంకు నివాళులర్పించిన ప్రముఖులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ :  కుమ్రం భీం 80వ  వర్ధంతి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్లోని ఆయన విగ్రహానికి శనివారం పలువురు రాజకీయ నాయకులు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీ అధ్యక్షురాలు కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, కలెక్టర్ సందీప్ కుమార్ తదితరులు కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జోడేఘాట్లో డబుల్ బెడ్రూంల నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. 

సీసీడీపీ నిధులతో మంజూరైన ఎడ్లబండ్లను 24 మంది గిరిజనులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. జోడేఘాట్లోని గిరిజనులందరికీ  డబుల్ బెడ్రూంలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తున్నదని  పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.