గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 01:21:40

టెంటు నీడే గూడు

టెంటు నీడే గూడు

  • అమ్మానాన్న మృతితో అనాథలుగా ఆడబిడ్డలు
  • అండగా నిలిచిన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌
  • అభినందించిన మంత్రి కేటీఆర్‌ 

చొప్పదండి, నమస్తే తెలంగాణ: ఆరేండ్ల కిందట అమ్మ.. నాలుగురోజుల కిందట నాన్న చనిపోవడంతో ఇద్దరు ఆడబిడ్డలు అనాథలయ్యారు. సొంతిల్లు లేక.. అద్దె ఇంటి యజమాని కర్మకాండలకు అభ్యంతరం వ్యక్తంచేయడంతో టెంటు నీడను గూడుగా చేసుకొన్నారు. ఆపదలో ఉన్న ఆడబిడ్డలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అండగా నిలిచారు. ఆడబిడ్డలకు ఆపదకాలంలో అండగా నిలిచిన సుంకె రవిశంకర్‌ను ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా అభినందించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని కాట్నపల్లికి చెందిన నేరెళ్ల పాపయ్యగౌడ్‌, కనుకమ్మ దంపతులు కూలీ చేసుకుంటూ ఇద్దరు కూతుళ్లు సమత, మమతతో కలిసి పూరి గుడిసెలోనే ఉంటున్నారు. 

ఐదేండ్ల కిందట గుడిసె కాలిపోవడంతో అద్దె ఇంట్లోకి మారారు. 2014లో కనుకమ్మ అనారోగ్యంతో మరణించింది. దీంతో పెద్ద కుమార్తె సమత 7వ తరగతిలోనే చదువు మానేసి తండ్రికి తోడుగా కూలికి వెళ్తున్నది. పనికి వెళ్లి అస్వస్థతకు గురైన పాపయ్య నాలుగురోజుల కిందట చనిపోవడంతో ఇరవైఏండ్ల సమత, 15 ఏండ్ల మమత అనాథలయ్యారు. కర్మ కాండలు పూర్తయ్యేదాకా ఇంట్లో ఉండేందుకు యజమాని అభ్యంతరం చెప్పడంతో గ్రామంలోనే టెంటు వేసుకొని ఉంటున్నారు.

రూ.20 వేల సాయం.. ఉపాధికి హామీ

అనాథలైన సమత, మమతకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అండగా నిలిచారు. వారు ఉంటున్న టెంటు వద్దకు  వెళ్లి తక్షణ సాయంగా రూ.20 వేలు అందజేశారు. లాక్‌డౌన్‌ అయిపోగానే సమతకు ఉపాధి కల్పిస్తానని, పెండ్లి చేయిస్తానని, డబుల్‌బెడ్‌రూం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.


logo