మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 12:40:24

పవర్‌తో పెట్టుకుంటే పవర్‌లో లేకుండా పోతారు : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

పవర్‌తో పెట్టుకుంటే పవర్‌లో లేకుండా పోతారు : ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : పవర్‌(కరెంట్‌)తో పెట్టుకుంటే పవర్‌లో‌(అధికారంలో) లేకుండా పోతారని బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న విద్యుత్‌ బిల్లుపై టీఆర్‌ఎస్‌ఎల్పీలో జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లుతో రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రైతులకు సబ్సిడీలు ఇవ్వలేమని ప్రధాని మోదీ చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తుందన్నారు. రాష్ర్టాల హక్కులను మోదీ సర్కార్‌ కాలరాస్తోందన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. పవర్‌తో పెట్టుకుంటే పవర్‌ లేకుండా పోతారని హెచ్చరించారు. 

ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులను ఎంపీ అరవింద్‌ మోసం చేశారన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ర్టానికి కేంద్రం నుంచి నిధులు తేవాలని సవాల్‌ విసిరారు. పవర్‌తో పెట్టుకున్నోళ్లు ఎవరూ పైకి రాలేదన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై కేంద్రం ఎన్నాళ్లు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. విద్యుత్‌ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. కరెంట్‌ విషయంలో కేంద్రంపై రైతులు పోరాటం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. వలస కార్మికుల ఉసురు కేంద్రానికి తగులుతుందని పేర్కొన్నారు.


logo