మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 01:01:20

కాంగ్రెస్‌ ఎవరి జాగీరూ కాదు

కాంగ్రెస్‌ ఎవరి జాగీరూ కాదు

-పార్టీ అంటే పిల్లల పరాష్కమా?

-రాష్ట్రమంతా కరోనానే

-కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదని వ్యాఖ్య 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మాటలతూటాలతో విరుచుకుపడ్డారు. పార్టీ ఎవరి జాగీరు కాదని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుంతియా, రేవంత్‌రెడ్డి పార్టీని చూసుకుంటే మేం ఇంట్లో కూర్చోవాలా? అని ప్రశ్నించారు. పార్టీ అంటే పిల్లల పరాష్కమా?.. ఈ విషయంపై కోర్‌ కమిటీలో కుంతియాను ప్రశ్నిస్తానన్నారు. అసలు పార్టీలో పనిచేయాలా? వద్దా? అనేది సమావేశంలో మాట్లాడి తేల్చుకుంటామని స్పష్టంచేశారు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే కోర్‌కమిటీలో ముందుగా చర్చించి నిర్ణయించాలని, అవేవీ లేకుండానే సొం తంగా కార్యక్రమాలు చేపట్టడమేమిటంటూ రేవంత్‌రెడ్డి తీరును మరోసారి ఎండగట్టారు. ప్రతి ఒక్కరూ మీడియా ఎదుట మాట్లాడి పలుచన కావొద్దని సూచించారు. కాంగ్రెస్‌ కార్యక్రమాలకు కొన్ని న్యూస్‌చానల్స్‌ను బ్యాన్‌చేయాలనే ప్రతిపాదన తప్పని, ఏ చానెల్‌ను బహిష్కరించలేదని స్పష్టత ఇచ్చారు. రాష్ట్రమంతా కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై దృష్టి పెట్టిందని, కాంగ్రెస్‌ను ఎవరూ పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని వ్యాఖ్యానించారు.


logo
>>>>>>