ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:28:25

కేసీఆర్‌ను కోరుకుంటున్న దేశం

కేసీఆర్‌ను కోరుకుంటున్న దేశం
  • ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు.. అభివృద్ధి, సంక్షేమానికి దిక్సూచిగా నిలుస్తున్నాయని ప్రభు త్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. ఇదే విషయాన్ని అనేక నివేదికలు వెల్లడించడంతోపాటు కేంద్రమంత్రులు పార్లమెంటులో ప్రస్తావించారని పేర్కొన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. గురువారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాల్సివస్తే అది కేసీఆర్‌ వల్లనే సాధ్యమవుతుందని దేశ ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.  పెండింగు ప్రాజెక్టులను రన్నింగ్‌ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని గువ్వల చెప్పారు.


పథకాలపై బీజేపీ ఎమ్మెల్యే ప్రశంసలు

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌  పథకాలపై ప్రశంసలు కురిపించారు. ఇవి చాలా మంచి పథకాలని కొనియాడారు. 


పల్లెప్రగతితో గ్రామాల్లో స్వచ్ఛ కళ: మంత్రి ఎర్రబెల్లి 


పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో స్వచ్ఛకళ కనిపిస్తున్నదని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వ్యర్థాలను తీసుకెళ్లడానికి, మొక్కలకు నీళ్లు పెట్టడానికి ప్రతి పంచాయతీకి ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ప్రతినెలా అన్ని గ్రామ పంచాయతీలకు ఉపాధి నిధులతోపాటు రూ.339 కోట్లను విడుదలచేస్తున్నదని చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్‌కుమార్‌, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, అజ్మీరా రేఖ, అనసూయ దనసరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.


18,100 హెక్టార్లలో ఆయిల్‌పామ్‌: మంత్రి నిరంజన్‌రెడ్డి


రాష్ట్రంలో 2.78 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమని కేంద్రకమిటీ ఇప్పటికే తెలిపిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. 2021-2022 ఏడాదికి 18,100 హెక్టార్లలో సాగుకు అనుమతి లభించిందన్నారు. ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, భాస్కర్‌రావు, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఆయిల్‌పామ్‌ రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.20,800 సబ్సిడీ ఇస్తున్నదన్నారు. విత్తనసాగుపై ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్‌, అంజయ్యయాదవ్‌ అడిగిన ప్రశ్నకు నిరంజన్‌రెడ్డి సమాధానమిస్తూ.. దేశంలో 35 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా, 22 లక్షల నుంచి 24 లక్షల టన్నులు తెలంగాణనే అందిస్తుందని చెప్పారు.


logo