ఆదివారం 31 మే 2020
Telangana - May 04, 2020 , 01:40:54

కరోనా పోరులో వైద్య‘మిత్ర’

కరోనా పోరులో వైద్య‘మిత్ర’

  • స్నేహితులతో కలిసి రోబో రూపొందించిన ఓరుగల్లు వాసి
  • బెంగళూరు దవాఖానలో సేవలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మీ సమస్య ఏమిటి? జ్వరం, జలుబు, దగ్గు ఉన్నదా? ఎంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నది? అన్ని ప్రశ్నలు వేస్తుంది.. టెంపరేచర్‌ను చెక్‌ చేస్తుంది.. కరోనా పాజిటివ్‌ అని తేలితే ప్రత్యేక వార్డుకు తీసుకెళ్తుంది ఓరుగల్లు యువకుడు రూపొందించిన అత్యాధునిక రోబో. కరోనా వేళ ఇది వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి వైరస్‌ వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేస్తున్నది. వరంగల్‌లోని గోపాల్‌పూర్‌కు చెందిన దండు భరత్‌కుమార్‌.. కిట్స్‌లో బీటెక్‌ చేసి.. మద్రాస్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివారు. బాలాజీ విశ్వనాథన్‌, మహాలక్ష్మితో కలిసి బెంగళూరు కేంద్రంగా ఇన్వెంటో రోబోటిక్స్‌ కంపెనీని ప్రారంభించారు. వారు తయారుచేసిన 30కిపైగా రోబోలు వివిధ రంగాల్లో సేవలందిస్తున్నాయి. కొవిడ్‌-19 సేవలకు అనుగుణంగా ‘మిత్ర’ రోబోకు మార్పులుచేర్పులు చేసినట్టు భరత్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. కరోనా సేవలకు అదనపు ఫీచర్లతో మరో రోబోను రూపొందిస్తున్నట్టు చెప్పారు. 

 పలుకరించి.. వివరాలు సేకరించి.. 

 సిబ్బంది స్థానంలో పనిచేసే ఈ రోబో.. టెంపరేచర్‌ తీసి, వారిని వాడుక భాషలోనే జ్వరం, జలుబు, దగ్గు.. ఇతర లక్షణాల గురించి ఆరా తీసి నమోదుచేస్తుంది. దీని ఆధారంగా కరోనా లక్షణాలు కనిపిస్తే.. వైద్యుడు తెరమీద ప్రత్యక్షమై పేషెంట్‌తో మాట్లాడుతారు. పాజిటివ్‌ ఉంటే కొవిడ్‌ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాలని సూచిస్తారు. నెగెటివ్‌ ఉంటే సంబంధిత వైద్యుడి వద్దకు వెళ్లేందుకు పాస్‌ను జారీచేస్తుంది. 

మిత్ర రోబోకు 5వ వర్షన్‌

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌లో ఆవిష్కరించిన మిత్ర రోబోకు ఇది 5వ వర్షన్‌. ఫోర్టిస్‌ దవాఖానలో దీని సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. రోబోల తయారీకి మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌భాస్కర్‌ ప్రోత్సాహం, సహకారం ఉన్నది. ప్రభు త్వం చొరవచూపితే తయారీకి సిద్ధంగా ఉన్నాం. 

- దండు భరత్‌కుమార్‌, సీటీవో ఇన్వెంటో రోబోటిక్స్‌ 


logo