గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:45

ప్రశంసలేనా.. పైసలివ్వరా?

ప్రశంసలేనా.. పైసలివ్వరా?

 • తెలంగాణపై కేంద్రానికి ఎందుకింత వివక్ష 
 • జల్‌జీవన్‌ కంటే మిషన్‌ భగీరథ అద్భుతం
 • రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు రాబట్టాలి 
 • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచన
 • పంచాయతీల నుంచి భగీరథ నిర్వహణ ఖర్చుల వసూలు అవాస్తవమని వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకంపై కేం ద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపిస్తున్నదని తప్ప.. ఎన్నిసార్లు కోరినా పైసా ఇవ్వడంలేదని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. బీజేపీ పాలితరాష్ర్టాలకే డబ్బులిస్తూ... తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం జల్‌జీవన్‌మిషన్‌ కంటే ఇంటింటికీ కృష్ణా, గోదావరి నీటిని అందిస్తున్న మిషన్‌ భగీరథ అద్భుతమైన పథకమ ని కొనియాడారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని మిషన్‌ భగీరథ ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథ కింద 60 శాతం పనులు పూర్తిచేశాక.. 40 శా తం నిధులివ్వాలని కేంద్రాన్ని కోరామని చెప్పా రు. సీఎం కేసీఆర్‌, ఎంపీలతోపాటు, తాను ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తిచేసినా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. 

మిషన్‌ భగీరథను ఆదర్శంగా తీసుకుని పనులు చేపట్టిన రాష్ర్టాలకు నిధులు మం జూరు చేస్తున్న కేంద్రం.. ఆ పథకానికి రూపకల్పన చేసిన తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతున్నదో అర్థం కావడం లేదని అన్నారు. గుజరాత్‌లో తాగునీరందించే పథకం ఎప్పుడో పూర్తయిందని చెప్తున్న కేంద్రం.. పూర్తయిన పథకం కింద ఆ రాష్ర్టానికి రూ.883 కోట్లు ఎందుకిచ్చిందని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో 5 శాతం పనులు కూడా పూర్తికానప్పటికీ రూ.2,550 కోట్లు ఇచ్చిందని తెలిపారు. పథకం నిర్వహణ కోసం ఏటా రూ.2,110 కోట్లయినా ఇవ్వాలంటూ ఎన్నిసార్లు లేఖలు రాసినా బుట్టదాఖలే అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని హితవు పలికారు. రాష్ర్టానికి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నదంటూ బీజేపీ ఎంపీలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.

నాలుగేండ్లలోనే 80శాతం పూర్తి

మిషన్‌ భగీరథ పనులను నాలుగేండ్లలోనే 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఈ పథకానికి ఇప్పటిదాకా రూ.33,400 కోట్లు ఖర్చు చేశామని, రూ.38వేల కోట్లతో మొత్తం పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. భగీరథ కోసం రూ.46,123 కోట్లతో పరిపాలనా అనుమతులు వచ్చాయని, రూ.8వేల కోట్లు ఆదా అవుతాయని చెప్పా రు. మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రంలోని 23,787 ఆవాసాలకు ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నామని, మరో 188 ఆవాసాలకు నీరందించే ప్రక్రియ కూడా మొదలైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18,076 ట్యాంకులు నిర్మించామని, మరో 99 ట్యాంకులు ఈ నెల 30లోగా పూర్తవుతాయని చెప్పారు. మొత్తం 124 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతుందని చెప్పారు. మిషన్‌ భగీరథ నిర్వహణ ఖర్చులను గ్రామ పంచాయతీల నుంచి వసూలు చేస్తారనే వార్తల్లో నిజం లేదని మంత్రి ఎర్రబెల్లి కొట్టిపారేశారు. భగీరథకు సంబంధించిన పలు విషయాలను ఎర్రబెల్లి వెల్లడించారు.

భగీరథకు అవార్డులు- ప్రశంసలు

 • తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం మిషన్‌ భగీరథను ప్రధాని మోదీ 2016 ఆగస్టు ఏడున గజ్వేల్‌లో ప్రారంభించారు. అదే ఏడాది మే 22న మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రజలకు రక్షిత తాగునీటినందించేందుకు తెలంగాణ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.
 • భగీరథ స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు15న దేశవ్యాప్తంగా జల్‌శక్తి మిషన్‌ ప్రారంభించింది. ఇటీవల అన్నిరాష్ర్టాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రజల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇంటింటికీ నీరందించే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని అభినందించారు.
 • మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్‌ భగీరథ వినూత్న పథకమని ప్రశంసిస్తూ హడ్కో మూడుసార్లు అవార్డులు అందించింది.
 • నీటి వినియోగ సామర్థ్యం 20 శాతం పెంచినందుకుగాను జాతీయ వాటర్‌మిషన్‌-2019లో మిషన్‌ భగీరథకు జాతీయస్థాయిలో మొదటి బహుమతి ఇచ్చింది.
 • ఆన్‌లైన్‌ పర్యవేక్షణకుగాను 2018లో మిషన్‌ భగీరథకు స్కోచ్‌ అవార్డు లభించింది.
 • ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌, 15వ ఆర్థిక సంఘంతోపాటు పశ్చిమబెంగాల్‌, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాల ప్రతినిధులు మిషన్‌ భగీరథ పథకాన్ని స్వయంగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు.

జల్‌జీవన్‌ మిషన్‌ పథకంతో తేడాలు

 • మిషన్‌ భగీరథ కింద గోదావరి, కృష్ణా నదుల నీటిని ఫిల్టర్‌చేసి ఇంటింటికీ సరఫరా చేస్తుండగా.. జల్‌జీవన్‌ మిషన్‌తో బోర్‌వెల్స్‌ నీటిని అదీ ఫిల్టర్‌ చేయకుండా నేరుగా అందిస్తున్నారు. బోరు నీటితో ఫ్లోరైడ్‌, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది.
 • గుజరాత్‌లో అమలుచేస్తున్న పథకంలో 1/3 వంతు నీటిని మాత్రమే నర్మదా నది నుంచి తీసుకుంటుండగా.. మిగిలిన 2/3 వంతు బోర్‌వెల్స్‌ ద్వారానే అందిస్తున్నారు.
 • భగీరథ కోసం రాష్ట్రంలో రూ.45 వేల కోట్లు ఖర్చుచేయాలని నిర్ణయించగా.. పథకం పనులు చివరిదశకు చేరుకున్నాయి. జల్‌జీవన్‌ కోసం అన్నిరాష్ర్టాల్లో కలిపి రూ.3.60 లక్షల కోట్లు ఖర్చుచేసి 2024 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిరాష్ట్రంలో ఖర్చుచేసే నిధుల్లో 60 శాతం కేంద్రం, 40శాతం రాష్ర్టాలే భరించాల్సి ఉంటుంది.
 • తెలంగాణలో నాలుగేండ్లలోనే 98.4శాతం గృహాలకు తాగునీరందుతుంటే.. గుజరాత్‌లో పదేండ్ల కిందట మొదలైన తాగునీటి పథకం 80 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.
 • మిషన్‌ భగీరథ పథకం కోసం రాష్ట్రంలో 1,47,000 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేసి, ఇంటింటికీ నీరందిస్తున్నారు. ఇది భూగోళం చుట్టు కొలతకంటే మూడు రెట్లు ఎక్కువ. మొత్తం 35,160 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను నిర్మించారు. తాగునీటి సరఫరాకు 187 మెగావాట్ల విద్యుత్‌ను వాడుతున్నారు.