బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:04:41

వానెంత పనిజేసె..

వానెంత పనిజేసె..
  • అకాల వర్షంతో రైతులు ఆగం
  • మక్కజొన్న, మిర్చికి తీవ్ర నష్టం
  • వివరాలు సేకరించిన వ్యవసాయశాఖ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ : ఇటీవల కురిసిన అకా ల వర్షాలతో పలు జిల్లాల్లో అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి గాలివాన కు దెబ్బతినడంతో వారు ఆగమయ్యారు. వర్షాలకు మక్కజొన్న, వరితోపాటు కల్లాల్లో ఆరబోసిన మిర్చికి.. మార్కెట్లకు తీసుకొచ్చిన కందులు తదితర అపరాలకు నష్టం జరిగింది. నష్టంపై వ్యవసాయ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి నివేదికలు రూపొందిస్తున్నారు. 

కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షంతో కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, శంకరపట్నం, ఇల్లందకుంట మండలాల్లో 460 హెక్టార్లలో మక్కజొన్న, వరి, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 411 హెక్టార్లలో మక్కజొన్న, 49 హెక్టార్లలో వరి, 0.8 హెక్టార్లలో నువ్వుల పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏడు మండలాల్లో 129.2 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా సదాశివనగర్‌ మండలంలో 51.6 హెక్టార్లలో మక్కజొన్నకు  నష్టం జరిగింది. సోమవారం సాయంత్రం కురిసిన వడగండ్లవానకు సంగారెడ్డి జిల్లా అందోలు, హత్నూర, సిర్గాపూర్‌, కల్హేర్‌, నాగల్‌గిద్ద మండలాల్లో వరి 61.6 హెక్టార్లు, జొన్న 197.06 హెక్టార్లు, మక్కజొన్నకు 6.8 హెక్టార్లలో,  మెదక్‌ జిల్లా రామాయంపేట, నిజాంపేట, మెదక్‌ మండలాల్లో మక్కజొన్న పంట 40 హెక్టార్లలో, నల్లగొండ జిల్లాలో 976 హెక్టార్లలో వరి దెబ్బతింది. ఖమ్మం జిల్లాలో వర్షానికి కల్లాల్లో ఉన్న మిర్చితోపాటు ఖమ్మం మార్కెట్‌కు తీసుకొచ్చిన మిర్చి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. 45 మెట్రిక్‌ టన్నుల మిర్చికి నష్టం వాటిల్లగా, 117 హెక్టార్లలో మక్కజొన్న తడిసింది. 


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికంగా..

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని నర్సంపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, గీసుగొండ, సంగెం, దామెర మండలాల్లో 2,132 హెక్టార్లలో ని మక్కజొన్నకు న ష్టం వాటిల్లింది. ఫలితంగా 27 గ్రా మాల్లోని 4,625 మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి, దాసరిపల్లి గ్రామాల్లో సుమారు 100 హెక్టార్లలో చపాట రకం మిరప పంటకు నష్టం వాటిల్లింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, రేగొండ, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లో మక్కజొన్న, కల్లాల్లో మిర్చి దెబ్బతిన్నది. 


క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే

వర్షాలకు నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మక్కజొన్న నేలవాలగా.. ఎంతమేర పంట నష్టం జరిగిందో పూర్తిస్థాయి నివేదికలు రూపకల్పనలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పంట నష్టం సర్వే పూర్తవ్వగా.. బుధవారం నివేదికలను ప్రభుత్వానికి అందజేయనున్నారు.


logo
>>>>>>