శుక్రవారం 10 జూలై 2020
Telangana - May 30, 2020 , 01:45:20

వేర్వేరు చోట్ల మైనర్లపై లైంగికదాడులు

వేర్వేరు చోట్ల మైనర్లపై లైంగికదాడులు

  • చందానగర్‌లో నిద్రిస్తున్న బాలికపై.. 
  • తాండూరులో కూతురిపై తండ్రి..

చందానగర్‌/తాండూరు: 

వేర్వేరు చోట్ల బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చందానగర్‌లో నిద్రిస్తున్న బాలికపై లైంగిక దాడి జరగ్గా, వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలో కన్నతండ్రే కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. పటాన్‌చెరుకు చెందిన దంపతులు తమ పెద్ద కూతురితో కలిసి స్థానికంగా ఉన్న ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వీరి రెండో కూతురు(10), మూడో కూతురు చందానగర్‌లోని అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. వేసవి కావడంతో గురువారం రాత్రి అమ్మమ్మతో కలిసి ఇద్దరు అమ్మాయిలు ఆరుబయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో కరెంట్‌ పోయింది. అదే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి.. పదేండ్ల చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి.. ఇంట్లోకి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తప్పించుకొని బయటకు వస్తున్న బాలికను.. నిందితుడు నెట్టేస్తూ పారిపోయాడు. ఈ క్రమంలో బాలిక తలకు గాయాలయ్యాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. అయితే స్థానికంగా ఉండే ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నదని, ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

తాండూరు మండలంలో..

వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏండ్ల బాలికపై కన్నతండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక వేరే ప్రాంతంలో చదువుకుంటున్నది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో కూతురిని భయపెట్టి లొంగదీసుకొని వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ బాధను భరించలేక ఆ చిన్నారి నానమ్మకు చెప్పడంతో వెంటనే ఆమె కరణ్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక తండ్రిని అరెస్టు చేసినట్లు తాండూరు సీఐ తెలిపారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. logo