బుధవారం 27 మే 2020
Telangana - May 22, 2020 , 00:41:31

ఏపీ ఎత్తిపోతపై కేంద్ర సర్కారు దోబూచులు

 ఏపీ ఎత్తిపోతపై కేంద్ర సర్కారు దోబూచులు

  • రాష్ర్టాల కోర్టుల్లోకే ‘సీమ’ ఎత్తిపోత!
  • అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కేంద్ర జల్‌శక్తి సిద్ధం
  • ఎజెండా అంశాలు రెండు రాష్ర్టాలే     ఖరారు చేసుకోవాలని సూచన
  • ఏపీ కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేకుండా లేఖ 
  • ముందుగా కృష్ణాబోర్డు భేటీకి ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాయలసీమ ఎత్తిపోతల అంశాన్ని తిరిగి రెండు రాష్ట్రాల కోర్టుల్లోకి నెట్టి అటు కేంద్రం, ఇటు కృష్ణాబోర్డు దోబూచులాడుతున్నాయి. నదీజలాల అంశాలకు సంబంధించి భేదాభిప్రాయాలు వస్తే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం జోక్యం చేసుకుని అపెక్స్‌ కౌన్సిల్‌ వేదికగా పరిష్కరించాల్సిన కేంద్రం.. రెండు రాష్ర్టాలే తేల్చుకోవాలి అనేవిధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ అంశానికి ముఖ్యమంత్రుల స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని భావించిన కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి సిద్ధంచేసింది. కానీ, ఈ విషయాన్ని సూటిగా చెప్పకుండా సమావేశ ఎజెండా అంశాలను రాష్ర్టాలే నిర్ణయించాలంటూ మెలికపెట్టింది. ఈ మేరకు గురువారం కేంద్ర జల్‌శక్తి అధికారికంగా సమాచారం ఇచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి ఏసీ మాలిక్‌ గురువారం తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశ తేదీని ఖరారు చేసి.. త్వరలో సమాచారమిస్తామన్న మాలిక్‌ ముందుగా రెండురాష్ర్టాలు సమావేశ ఎజెండా అంశాలను అత్యవసర ప్రాతిపదికన పంపాలని అందులో సూచించారు. అంతకుముందే బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తి అధికారికంగా సమాచారమిచ్చింది. శ్రీశైలం నుంచి పెన్నాబేసిన్‌కు అక్రమంగా జలాలను తరలించేందుకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవో 203పై తెలంగాణ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. తర్వాత ఏపీ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదుచేసింది. దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి సిద్ధమైన కేంద్రం ఈ మేరకు రాసిన లేఖలో ఎక్కడా రెండురాష్ట్రాల ఫిర్యాదులను ప్రస్తావించకుండా జాగ్రత్త పడింది. ఈ ఏడాది జనవరిలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల అధికారులతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమావేశంలో నిర్ణయం మేరకే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ అవుతున్నట్టు మాత్రమే పేర్కొన్నది. ఎజెండా అంశాలు పంపిస్తే సమావేశంలో పెడతామని సూచించింది.

బోర్డు సమావేశంపైనా అదే తీరు

అపెక్స్‌ కౌన్సిల్‌కు ముందుగానే కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని గురువారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచించడంతో బోర్డు అధికారులు హడావుడిగా ఏర్పాట్లుచేశారు. ఇందులోనూ సమావేశతేదీని ఖరారు చేయలేదు. పైగా నాలుగు అంశాలను ఎజెండాగా చేర్చి.. ఇంకేమైనా ఉంటే ఈనెల 26లోగా బోర్డుకు సమర్పించాలని సూచించారు. బోర్డు ప్రస్తావించినవాటిల్లో 11వ సమావేశ నిర్ణయాల అమలు, రెండు రాష్ర్టాలు కృష్ణా ప్రాజెక్టుల డీపీఆర్ల సమర్పణ, రెండోదశ టెలిమెట్రీ, బోర్డు బడ్జెట్‌తోపాటు బోర్డు చైర్మన్‌ అనుమతితో ఇతర అంశాలు అని మాత్రమే పేర్కొన్నారు. కాగా, నాగార్జునసాగర్‌ కుడి కాలువ నుంచి రెండు టీఎంసీలు కావాలంటూ ఏపీ సమర్పించిన ఇండెంట్‌పై శుక్రవారం రెండు రాష్ట్రాల ఈఎన్సీలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


logo