ఆదివారం 31 మే 2020
Telangana - May 21, 2020 , 00:53:05

రాష్ట్ర వాటాలో మళ్లీ కోత

రాష్ట్ర వాటాలో మళ్లీ కోత

  • వరుసగా రెండో నెల కత్తెరవేసిన కేంద్రం
  • రెండు నెలల్లో రూ.424 కోట్లకు గండి

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్ను ల వాటాలో కేంద్రం మళ్లీ కోత విధించింది. ఏప్రిల్‌ మాదిరిగా మే నెలలో కూడా కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు రావాల్సిన వాటాలో 17.81 శాతం వరకు నిధులకు కత్తెర వేసింది. కరోనా కల్లోల సమయంలో ఈ నెలలోనైనా పూర్తిస్థాయిలో నిధులను విడుదల చేస్తార ని ఆశించిన రాష్ర్టాలకు నిరాశే మిగిలింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ఆర్థికశాఖ బుధవారం విడుదలచేసింది. మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి రూ.46,038కోట్లు కేటాయించింది. అందు లో తెలంగాణకు రూ.982 కోట్లు విడుదలయ్యాయి. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లోనే అంచనా వేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో అన్ని రాష్ట్రాలకు కలిపి చెల్లించాల్సింది రూ.7.84 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనావేసింది. ఆ మొత్తాన్ని రాష్ర్టాలకు 14 వాయిదాలలో చెల్లిస్తుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి వరకు ఒక్కో భాగం చొప్పున చెల్లించి, మార్చి నెలలో మిగిలిన మొత్తం మూడు భాగాలను ఒకేసారి ఇస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.16,716 కోట్ల అంచనాను ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని రూ.1,194 కోట్ల చొప్పున 14 వాయిదాలలో చెల్లించాలి. కానీ గత రెండు నెలలుగా కేంద్రం రూ.982 కోట్లు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నది. దీంతో రెండునెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.424 కోట్ల గండిపడింది. రావాల్సిన వాటాలో 17.81 శాతం నిధులకు కోత విధించినట్టు కేంద్ర ఆర్థికశాఖ తన లెక్కల్లో చూపింది. ఎందుకు, ఏమిటి అన్నదానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.

మున్సిపాలిటీలకు రూ. 100.25కోట్లు

 పది లక్షలలోపు జనాభా ఉన్న పురపాలక సంఘాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిధులను విడుదలచేసింది. అన్ని మున్సిపాలిటీలకు రూ.5,025కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రాష్ర్టానికి వంద కోట్ల 25 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. వీటిని స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా ఆయా మున్సిపాలిటీలకు వారం రోజులలోపు పంపిణీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. 


logo