శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:00

వర్షార్పణం

వర్షార్పణం

  • చేతికొచ్చిన పంటలకు తీవ్రనష్టం
  • వాలిన వరి, చెట్లపై పత్తి మొలక 
  • రైతులకు మంత్రుల పరామర్శ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఎడతెరిపి లేని వర్షాలతో చేతికొచ్చిన పంటలు వర్షార్పణం అయ్యాయి. వరి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లగా.. మిరప, సోయాబీన్‌ సైతం దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయానికి నీటిపాలవ్వడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. గురువారం పలు జిల్లాల్లో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, సబిత క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు.  

వరి, పత్తి రైతు బేజారు 

భారీ వర్షాలతో వేల ఎకరాల్లో వరి నేలవాలగా.. ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి తడిసి చెట్లపైనే మొలకెత్తింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1.18 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, 100 ఎకరాల్లో కందికి నష్టం జరిగింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 15,777 ఎకరాలు, నిర్మల్‌ జిల్లాలో 8,706 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 83,677 ఎకరాలు, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో 2.81 లక్షల ఎకరాల్లో పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 42,823 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పాత వరంగల్‌ జిల్లాలో 94,492 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రోజుల తరబడి ఎక్కువ నీరు చేరడంతో పత్తి పంట పూర్తిగా ఎర్రబారిపోతోంది. వికారాబాద్‌ జిల్లాలో 42,651 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 25,633 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలకు నష్టం జరిగింది.   

మంజీరలో చిక్కిన ఐదుగురు క్షేమం

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌ సమీపంలోని మంజీర పాయలో చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను అధికారయంత్రాంగం గురువారం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వ్యవసాయ క్షేత్రంలో పనికి వెళ్లడానికి నదిపై కిష్టాపూర్‌ శివారులో ప్రైవేటుగా బ్రిడ్జి నిర్మించారు. బుధవారం సాయంత్రం వరద ఉధృతికి బ్రిడ్జి నీటమునగడంతో వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన నాగరాజు, మెదక్‌ మండలం జానకంపల్లికి చెందిన దుర్గాప్రసాద్‌, మెదక్‌ పట్టణానికి చెందిన శ్రీధర్‌, హైదరాబాద్‌కు చెందిన కొమురయ్యలతోపాటు పశువులు మేపుతున్న మహేశ్‌ అనే వ్యక్తి అక్కడే చిక్కుకున్నారు. విషయాన్ని కిష్టాపూర్‌ సర్పంచ్‌ తిరునగిరి గోదావరికి ఫోన్‌ ద్వారా తెలిపారు. తమను ఎలాగైన రక్షించాలని విజ్ఞప్తిచేయడంతో సర్పంచ్‌ ఈ విషయాన్ని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి చెప్పారు. ఆయన మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తికి చెప్పగా.. మెదక్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, మెదక్‌ ఇన్‌చార్జి ఎస్పీ జోయల్‌ డెవిస్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గురువారం మధ్యాహ్నం 12:45కు ముగ్గురు ఆర్మీ సిబ్బందితో కూడిన హెలికాప్టర్‌ ఘటనా స్థలానికి చేరుకొని మూడు విడతల్లో ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. 

మంత్రుల పర్యటన.. పరామర్శ

వర్షం కారణంగా పంట నష్టం జరిగిన రైతులను మంత్రులు పరామర్శించి ఓదార్చారు. మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పర్యటించిన మంత్రి ఈటల.. 40 ఏండ్లలో ఇలాంటి వానలను తాను చూడలేదని అన్నారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి, ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లి, వీణవంక మండలం శ్రీరాములపేటతోపాటు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శ్రీరాములపల్లిలో పంటలను పరిశీలించారు. చొప్పదండి మండలం కొలిమికుంట, రామడుగు మండలం తిర్మలాపూర్‌, గంగాధర మండలం బూరుగుపల్లిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పంటలను పరిశీలించారు. వికారాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్యే ఆనంద్‌తో కలిసి పర్యటించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని చెప్పారు.

కూలిన సర్వాయి పాపన్న కోట

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపురంలో 400 ఏండ్ల క్రితం సర్దార్‌ సర్వాయి పాపన్న నిర్మించిన కోట గురువారం నేలమట్టమైంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కోటగోడలు నెర్రలు బారి ఓ భాగం కూలిపోయింది.  

ప్రతిపక్షాలది రాజకీయం: సత్యవతిరాథోడ్‌  

గత పాలకుల హయాంలోనే వరంగల్‌ నగరంలో నాలాలు ఆక్రమణకు గుయ్యాయని, పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆరోపించారు. వరంగల్‌ నగరంలో ముంపునకు గురైన అమరావతి నగర్‌, గాంధీనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్‌ పమేలా సత్పతితో కలిసి పర్యటించి, బాధితులతో మాట్లాడారు.  

సురేందర్‌.. సూపర్‌ కాప్‌: డీజీపీ

భారీ వరదను సైతం లెక్కచేయకుండా ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వర్తించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సురేందర్‌పై పోలీస్‌ ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసలు కురిపించారు. విధుల్లో భాగంగా వరదలో కొట్టుకుపోతున్న ఓ యువకుడి మృతదేహాన్ని జేసీబీ బొక్కెనలో కూర్చుని తాడు సహాయంతో పైకిచేర్చాడు. ఈ దృశ్యాన్ని రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ ట్విట్టర్‌లో గురువారం పోస్టుచేశారు. దీనిపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి స్పందిస్తూ...‘మానవత్వాన్ని మించిన బంధం మరేదీ లేదు. సమాజ సేవ చేయడమే మా విధి. ఖాకీ దుస్తుల్లో ఉన్నందుకు గర్వపడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు. 



సింగూరులో మంత్రి హరీశ్‌రావు సమీక్ష

సంగారెడ్డి జిల్లాలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం పర్యటించారు. సింగూరు ప్రాజెక్టు నిండడంతో గంగమ్మకు పూజలు చేశారు. సింగితంలో తెగిన రోడ్లను పరిశీలించి, సంగారెడ్డి మున్సిపాలిటీలోని ముంపు ప్రాంతాలైన లాల్‌సాబ్‌ గడ్డ, నారాయణరెడ్డి కాలనీ, బొబ్బిలికుంట ప్రాంతాలను మంత్రి సందర్శించారు. అనంతరం భారీ వర్షాలతో జరిగిన నష్టంపై సింగూరు వద్ద మంత్రి అధికారులతో సమీక్షించారు. వర్షంతో దెబ్బతిన్న రోడ్లను బాగుచేయించాలని, కూలిన ఇండ్లకు తక్షణ సాయం అందించాలని అధికారులకు సూచించారు.  

రంగారెడ్డిలో 5 మృతదేహాలు లభ్యం

వరద నీటిని దాటేందుకు యత్నించి మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు నీటి ప్రవాహంలో గల్లంతవ్వగా గురువారం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కందుకూరు మండలం బేగంపేటకు చెందిన వెంకటేష్‌గౌడ్‌, బాచుపల్లికి చెందిన రాఘవేందర్‌ కారు అనాజ్‌పూర్‌ సమీపంలో నీటిలో కొట్టుకుపోగా.. ఇద్దరూ గల్లంతయ్యారు. బుధవారం మధ్యాహ్నం వెంకటేష్‌గౌడ్‌ మృతదేహం, గురువారం ఉదయం రాఘవేందర్‌ మృతదేహం లభ్యమైంది. వరద తీవ్రంగా ఉండటంతో కానిస్టేబుల్‌ సురేందర్‌ నడుముకు తాడు కట్టుకొని జేసీబీ సహాయంతో రాఘవేందర్‌ మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. తారామతిపేట ఓఆర్‌ఆర్‌ వద్ద గల్లంతయిన హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన విపిన్‌ కుమార్‌(22) మృతదేహం ప్రమాదస్థలికి సమీపంలోనే లభ్యమైంది. తుర్కయాంజాల్‌ తొర్రూర్‌ సమీపంలో గల్లంతయిన రాజీవ్‌ గృహకల్పకు చెందిన చేకూరి సునిల్‌ కుమార్‌ కొడుకు జయదీప్‌(19), కుర్వపు దక్షిణామూర్తి కుమారుడు ప్రణయ్‌(16) మృతదేహాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి 150 మీటర్ల దూరంలో తరువాత లభించాయి. 

‘మూసీ’ ప్రాంతాల్లో హైలెవల్‌ బ్రిడ్జిలు

మూసీ పరీవాహక ప్రాంతాల్లో హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌తో చర్చిస్తానని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి-అమ్మనబోలు మీదుగా వెళ్లే వరంగల్‌ రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోగా, గురువారం మంత్రి పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా తాత్కాలిక పునురుద్ధరణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రితో చర్చించి మూసీ ప్రాంతాల్లో ఉన్న వంతెనలను హైలెవల్‌ బ్రిడ్జిలతో నిర్మిస్తామని తెలిపారు. మంత్రివెంట నల్లగొండ జెడ్పీచైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్‌ తదితరులు ఉన్నారు. 

చేలల్లో నీళ్లు నిల్వ ఉండనివ్వొద్దు

భారీవర్షాల నేపథ్యంలో చేలల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయవర్సిటీ రైతులకు సూచించింది. నీరు తొలగించిన వెంటనే పడిపోయిన పత్తి మొక్కలు, వరి కంకులను నిలబెట్టే ప్రయత్నం చేయాలని తెలిపింది. వర్షాలు తగ్గాక పత్తికి లీటర్‌ నీటికి 10 గ్రా. పొటాషియం నైట్రేట్‌ లేదా 19:19:19 లేదా 28:28:0 మిశ్రమ ఎరువులను ప్రతి 7-10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలని పరిశోధనావిభాగం డైరెక్టర్‌ జగదీశ్‌ సూచించారు. పత్తి కాయలు కుళ్లిపోకుండా 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌, 2గ్రా. ప్లాంటో మైసిన్‌ కలిపి ఏడురోజుల వ్యవధిలో 2-3 సార్లు, పూత, పిందె రాలకుండా 5లీటర్ల నీటిలో 1 మి.లీ ప్లానోవిక్స్‌ ద్రావణాన్ని కలిపి పిచిచారీ చేయాలని తెలిపారు. వరికి యూరియా వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.



పశుసంరక్షణకు చర్యలు: డైరెక్టర్‌ 

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పశుసంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా, మండల పశువైద్యాధికారులను పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి ఆదేశించారు. వర్షాలతో కలుషిత నీరు తాగడం వల్ల పశువులు, ఇతర జీవాలు రోగాలబారిన పడే ప్రమాదం ఉన్నదని అన్నారు. వైద్యులంతా గ్రామాల్లో అందుబాటులో ఉండి పశువులకు అవసరమైన చికిత్స అందించాలని గురువారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటివరకు 20 ఆవులు, 44 బర్రెలు, 246 గొర్రెలు, 35 మేకలు, 10,700 కోళ్లు చనిపోయినట్టు తెలిపారు.


logo