గురువారం 02 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 15:19:22

మిషన్ భగీరథ పనుల్లో అలసత్వానికి తావులేదు

మిషన్ భగీరథ పనుల్లో అలసత్వానికి తావులేదు

నల్లగొండ : సమైఖ్య పాలనలో తాగు నీరులేక జిల్లా వాసులు ఫ్లోరైడ్ రక్కసి బారిన పడేవారు. స్వరాష్ట్రంలో సురక్షితమైన నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తరమైన మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ పై నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశానికి మంత్రులు హాజరై మాట్లాడారు. రూ. 40,123 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో అలసత్వానికి తావులేదన్నారు.

అలాగే ఏజెన్సీలను వెంటనే మార్చాలి. ఇప్పటికే కొందరిని మార్చినట్లు తెలిపారు. 95% పనులు పూర్తయ్యాయని 5% పనుల్లో లోపాలు ఉన్నాయని, అవి సరిదిద్దేందుకే సమీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మూడేండ్లలో 95 శాతానికి పైబడి పనులు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకం అన్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యం ఈ పథకానికి శాపంగా మారొద్దని సూచించారు. ఈ ప్రాజెక్ట్ జిల్లాకు ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. నది జలాలు నేరుగా ఇంటింటికి అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని తెలియజేశారు.

మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నరసింహ్మయ్య, యన్.భాస్కర్ రావు, రవీంద్ర నాయక్, చిరుమర్తి లింగయ్య జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరయ్యారు.


logo