మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 20:43:12

కేటీఆర్‌ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి

కేటీఆర్‌ పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ : ఈ నెల 17న వరంగల్‌ జిల్లాలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, సీపీ, నగర పాలక సంస్థ కమిషనర్‌తో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం హన్మంకొండలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్ల ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, నన్నపనేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌, వరంగల్‌ మహా నగరపాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతాసదానందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ రూ.650కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు.

కుడా ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ పరిధిలోని రాంపూర్‌లో నిర్మిస్తున్న ఆక్సీజన్‌ పార్క్‌, వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలో మంజూరైన 200 డబుల్‌ బెడ్రూం పడకల భవన సముదాయాని, కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే నర్సన్నపేట, ఖమ్మం, కరీంనగర్‌ ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలకు కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాల సముద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో 593 రెండు పడకల గదుల భవనాల సముదాయాన్ని ప్రారంభిస్తారన్నారు. అక్కడే కాజీపేటలో నిర్మించే 97 రెండు పడకల గదుల గృహాల సముదాయానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

అనంతరం వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని బట్టల బజార్‌ వై ఆకారంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని, మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌, నాయుడిపేట పెట్రోల్‌ పంపు నుంచి రెడ్డిపాలెం వరకు 8 కిలోమీటర్ల మేర ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. వరంగల్‌ మహానగర కార్పొరేషన్‌ వద్ద ఏర్పాటు చేసిన పోతన జంక్షన్‌ను ప్రారంభిస్తారని, భద్రకాళి మినీ ట్యాంక్‌ బండ్‌ను ప్రారంభిస్తారని, తూర్పు నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌ బండ్‌కు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అలాగే కుడా ఆధ్వర్యంలో వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరినీ పరిశీలిస్తారని వివరించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


logo