మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 13:48:19

ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ములుగు జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి పర్యటన

ములుగు : ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నపంటలు, ముంపునకు గురైన ప్రాంతాల్లో గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని జాకారంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రామప్ప, పాపాయిపల్లిలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో  ఎన్నడు లేని విధంగా భారీ వర్షాలు కురవడంతో ఈసారి పరిస్థితి విషమించిందన్నారు.

బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల ఆదుకునే ప్రయత్నం చేస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పుష్కలంగా పంటలు పండాలనే ఉద్దేశంతో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారని, పేర్కొన్నారు.


అందులో రామప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఒకటన్నారు. అయితే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందిని కూడా ప్రభుత్వం లేకుండా చేస్తుందన్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. మంత్రి వెంట జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ హన్మంతు, ఇతర అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు. logo