శనివారం 11 జూలై 2020
Telangana - May 31, 2020 , 01:31:35

‘నియంత్రిత’ విధానాన్ని పాటిద్దాం

‘నియంత్రిత’ విధానాన్ని పాటిద్దాం

  • చెప్పిన పంటలనే వేద్దాం
  • రైతులకు మంత్రుల పిలుపు
  • పలు జిల్లాల్లో అవగాహన సదస్సులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగా నియంత్రిత పంటలనే సాగు చేసి లబ్ధిపొందాలని పలువురు మంత్రులు రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయా జిల్లాల్లో నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన రైతు అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. అధిక ఆదాయాన్ని ఆర్జించాలంటే విభిన్న పంటల వైపు దృష్టిసారించాలని రైతులకు సూచించారు. 

బాన్సువాడ ఆదర్శం కావాలి: పోచారం

లాభదాయక పంటల సాగులో బాన్సువాడ నియోజకవర్గం రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో రైతు అవగాహన సదస్సుకు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర రావాలన్నదే సీఎం సంకల్పమన్నారు. 

పంటలు అమ్ముడుపోవాలి: వేముల

రైతు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా పంట లు అమ్ముడు పోవాలన్నదే సీఎం ఉద్దేశమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీరు రాగానే నిజాంసాగర్‌ మండలంలో నాగమడుగు మత్తడిని నిర్మించి జుక్కల్‌ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం: పువ్వాడ

రైతులు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానాన్ని తీసుకొచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలోనిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. త్వరలోనే సీతారామా ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని, ఈ జలాలను పాలేరు వరకు తరలించడం ద్వారా జిల్లాలో సుమా రు 7లక్షల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు.  

నూతన సాగుకు సిద్ధం కావాలి: జగదీశ్‌రెడ్డి

డిమాండ్‌ ఉన్న పంటలనే సాగు చేసేందుకు సిద్ధం కావాలని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. నూతన సాగు విధానంపై శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన  అవగాహన సదస్సుల్లో మంత్రి ప్రసంగించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకూడదనే సీఎం ని యంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. 

268 గ్రామాల రైతుల తీర్మానం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: నియంత్రిత పంటల సాగుకే రైతులు జైకొడుతున్నారు. ఆయా జిల్లాల్లో రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి బాసటగా నిలుస్తున్నా రు. ప్రభుత్వం చెప్పిన పంటలనే సాగు చేసి లబ్ధిపొందుతామని ప్రకటిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 229 గ్రామాల రైతులు నియంత్రిత పంటల సాగుకు మద్దతు పలికారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 37 గ్రామాలు,  ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఒక్కో గ్రామానికి చెందిన రైతులు కొత్త పంటలనే సాగు చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో నిర్వహించిన అవగాహన సదస్సులో మండలంలోని 14 గ్రామాలకు చెందిన రైతులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తీర్మాన పత్రాలు అందజేశారు.


logo