శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 09:37:51

నాన్నకు ప్రేమతో..

నాన్నకు ప్రేమతో..

వేల్పూర్‌ : రైతు సంక్షేమం కోసం జీవితాంతం ఆరాటపడ్డ రైతు నాయకుడు వేముల సురేందర్‌ రెడ్డి.. ఆ తండ్రి చూపిన బాటలో పయనిస్తూ సీఎం కేసీఆర్‌ సహకారంతో అన్నదాత సంక్షేమం కోసం అహర్నిషలు పరితపిస్తూ పని చేస్తున్న తనయుడు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి. తండ్రీ కొడుకులుగా రాజకీయాల్లో రైతు సంక్షేమాన్ని అభిలషించే పంథాలో తమ పయనాన్ని సాగించారు. తండ్రి దివంగతుడైన తర్వాత ఆయన ఆశయ సాధనకు అనునిత్యం కృషి చేస్తున్నారు మంత్రి వేముల. నియోజకవర్గ రైతులకు శాశ్వతంగా ఉపయోగపడేలా సాగు నీటి రంగాన్ని అభివృద్ధి చేస్తున్న మంత్రి ప్రతి సందర్భంలోనూ ‘నాన్న పై ప్రేమను’ చాటుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే వేముల సురేందర్‌ రెడ్డి స్వర్గరథం సేవలు అందిస్తున్న మంత్రి తాజాగా తండ్రి జ్ఞాపకార్థం స్వగ్రామమైన వేల్పూర్‌లో రూ.30 లక్షల సొంత ఖర్చుతో రైతు వేదికను నిర్మించారు. ఈ వేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబై ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

సీఎం కేసీఆర్‌ పిలుపుతో..

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతువేదికల నిర్మాణాలను ప్రారంభించే ముందు మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతూ.. రైతు వేదికలను సొంత ఖర్చులతో నిర్మించేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. వెంటనే మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించి తన తండ్రి వేముల సురేందర్‌ రెడ్డి జ్ఞాపకార్థం సొంత ఖర్చుతో వేల్పూర్‌లో రైతు వేదిక నిర్మించి ఇస్తానని ప్రకటించారు. రైతులన్నా, రైతు సంబంధ కార్యక్రమాలన్నా తన  తండ్రికి ఎంతో ఇష్టమని.. అది కేసీఆర్‌ తలపెట్టిన రైతు వేదిక భవనం కావడం మరింత సంతోషకరమని ప్రకటించి మంత్రి ఈ భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించారు.

రైతు పథకాలు కండ్ల ముందు కదిలేలా 

వేల్పూర్‌లో మంత్రి నిర్మించిన వేముల సురేందర్‌ రెడ్డి స్మారక రైతు వేదిక భవనం రంగులతో, కేసీఆర్‌ సర్కారు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతున్న సాగు నీటి రంగ అభివృద్ధికి సంబంధించిన చిత్రాలను గోడలపై వేయించారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్‌ కాకతీయ, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, వరద కాలువపై నిర్మించిన తుములు, ప్యాకేజి-21, కప్పల వాగు, పెద్ద వాగులో చెక్‌ డ్యాముల నిర్మాణం, లిఫ్టులు, తదితర చిత్రాలు వేశారు.