బుధవారం 20 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 15:11:44

యాదాద్రి అభివృద్ధి ప‌నులపై మంత్రి వేముల సమీక్ష

యాదాద్రి అభివృద్ధి ప‌నులపై మంత్రి వేముల సమీక్ష

హైద‌రాబాద్ : యాదాద్రి ఆల‌య అభివృద్ధి ప‌నుల త్వ‌రిత‌గ‌తిన పూర్తికి మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా యాదాద్రి పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తన అధికారిక నివాసంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన ఆలయం, పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలు, రింగ్ రోడ్డు పనుల పురోగతిని గురించి మంత్రి అధికారులను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. 

సీఎం కేసీఆర్‌ యాదాద్రిని ప్రపంచంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. సీఎం ఆలోచనల మేరకు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికతను సంతరించుకునే విధంగా నిర్మాణాలు జరగాల‌న్నారు. ప్రెసిడెన్షియల్ సూట్, వీవీఐపీ 13 విల్లాలు ఈ నెల లోపు పూర్తి చేయాల‌న్నారు. భక్తుల సౌకర్యార్థం పుష్కరిణి, కళ్యాణకట్ట పనులు కూడా ఈ నెలలోపే పూర్తి కావాల‌న్నారు. రూ. 143 కోట్లతో నిర్మిస్తున్న యాదాద్రి రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాల‌న్నారు. యాదాద్రి పనుల రోజువారీ వర్క్ చార్ట్ తయారు చేసుకోవాల‌ని సూచించారు. ప్రతివారం పనుల పురోగతి పై ఈఎన్సీ సమీక్ష నిర్వహించాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు యాదాద్రి పరిసర ప్రాంతాలంతా పచ్చదనంతో పరిఢవిల్లేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

యాదాద్రి రింగ్ రోడ్డు పనుల కోసం భూసేకరణ ఈ నెలలోపు పూర్తి చేయాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఈఎన్సీ గణపతి రెడ్డి, ఈఈ వసంత నాయక్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, పలువురు అధికారులు పాల్గొన్నారు.


logo