శుక్రవారం 10 జూలై 2020
Telangana - Mar 26, 2020 , 15:52:04

సామాజిక దూరం మన బాధ్యత: మంత్రి వేముల

సామాజిక దూరం మన బాధ్యత: మంత్రి వేముల

బాల్కొండ నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వేల్పూర్ మండల కేంద్రంలో అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు...ఎంత మంది స్వీయ నిర్బంధం లో ఉన్నారో వారి ఆరోగ్య పరిస్థితి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అత్యవసర సేవలు మినహాయించి ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ని బయట తిరగకుండా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని సూచించిన మంత్రి,స్వయంగా అధికారులతో సమీక్షా సమావేశంలో మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ పాటించాలని విజ్ఞప్తి. ప్రతి గంటకు ఒకసారి సైరన్ వేయడం గాని, మైక్ ద్వారా అనౌన్స్ మెంట్ చేయడం లాంటివి చేసే విధంగా గ్రామ సర్పంచ్, సెక్రెటరీ లు చర్యలు తీసుకోవాలి...ఆ సైరన్ లేదా మైక్ ద్వారా అనౌన్స్ మెంట్  వచ్చినప్పుడు ప్రజలు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు శుభ్రంగా ఉంటే ఈ వైరస్ ను దగ్గరికి రాకుండా చేయొచ్చు. దీంతో పాటు ముఖానికి మాస్క్ ధరించాలి. లేదా చేతి రుమాలు రెండు,మూడు మడతలు వేసి అడ్డుగా కట్టుకోవాలి. చేతి రుమాలు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.

తరుచూ చేతులు శుభ్రం చేసుకోవడం,ముఖానికి శుభ్రపరిచిన చేతి రుమాలు లేదా మాస్క్ కట్టుకోవడం లాంటి...ఈ రెండు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా శ్రీరామ నవమి పండుగ వస్తుంది..ఇది మనకు గొప్ప పండుగ..సీతా రాములవారి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు.... ఊరంతా కలిపి ఒకచోట చేరి జరుపుకునే ఉత్సవం... పెద్ద సంఖ్యలో జనం గుమిగూడు తారు. గుంపులు గా ఉన్నచోట ఈ కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్కసారికి రాములు వారి కల్యాణానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలి. గుడిలో అయ్యవార్లు ఇద్దరు,ముగ్గురు కలిసి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. ఇలాంటి సందర్భం ఏర్పడినందుకు ప్రజలు మన్నించాలి.

అలాగే మసీదులకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో వెళ్లకుండా సహకరించి.. మీ ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా. క్రైస్తవులు కూడా చర్చిలకు వెళ్లకుండా ఇంటి వద్ద నుంచే ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. కూరగాయలు,నిత్యావసర సరుకుల కోసం ప్రజలు మార్కెట్లు, కిరాణా షాపుల ముందు గుమిగుడుతున్నారు. మార్కెట్ లో కూరగాయలు తీసుకునే టప్పుడు మీటర్ దూరం పాటించాలి.మీటర్ దూరం ఉండేట్లు సున్నంతో రౌండ్ సర్కిల్ మార్కులు ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్,కార్యదర్శిలను కోరుతున్నా.  అలాగే కిరాణా షాపు ముందు కూడా మీటర్ దూరం పాటించాలని ప్రజలకు నా విన్నపం. అలాగే విదేశాల నుంచి వచ్చి భార్య పిల్లలతో ఒకే రూములో ఉంటున్న వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉండాలి..ఒకే రూములో ఉండడం వల్ల మీకు ఒకవేళ లక్షణాలు ఉంటే మీ కుటుంబ మొత్తానికి ప్రమాదం గనుకా..ఒకే గది ఉన్న వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతిలో ఉండాలి.

విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఎ ఎన్ ఎం లు గ్రామ స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు.ఐదుగురికి ఒక్కరు చొప్పున ఎ ఎన్ ఎం లను నియమించాం. ముగ్గురు ఎ ఎన్ ఎం లకు ఒక సూపర్ వైజర్ ను ఏర్పాటు చేసాం.ఈ సూపర్ వైజర్ ముగ్గురు ఎ ఎన్ ఎం ల పర్యవేక్షణ లో 15 మందిని చూస్తారు. అలాగే ముగ్గురు సూపర్ వైజర్లకు ఒక డాక్టర్ ను నియమించాం. దాదాపు డాక్టర్ ముగ్గురు సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో ఉన్న 50 మందిని చూస్తారు. ఈ విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని ఎ ఎన్ ఎం లు రోజు పరిశీలిస్తారు. సూపర్ వైజర్లు రెండు రోజులకోసారి చూస్తారు. డాక్టర్లు మూడు రోజులకొకసారి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు.ఇలా ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్ష చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్లను అదేశించాం. డ్రైనేజి కలుస్తున్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లాలని పారిశుధ్యం వారిని ఆదేశించడం జరిగింది. ఈ కరోనా మహమ్మారిని దూరం చేసేందుకు ప్రతిఒక్కరు సహకరించాలని ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నాని మంత్రి తెలిపారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ,రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ప్రధాని,ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారు. సామాజిక దూరం పాటించడం వల్ల ఈ వైరస్ ను అరికట్టవచ్చు. నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గుంపులు గుంపులు గా ఉంటే ఈ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యం .ప్రతి గంటకు ఓసారి చేతులు కడుక్కోవాలి. దీనికి సంబంధించి అన్ని గ్రామాల సర్పంచ్ లు,సెక్రెటరీలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేసారు.


logo