గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 02:13:30

పారదర్శకత కోసమే చట్ట సవరణలు

పారదర్శకత కోసమే చట్ట సవరణలు

  •  నాలా చట్ట సవరణపై మంత్రి వేముల 
  • బిల్లును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజలకు పారదర్శక పాలనను అందించడానికే ప్రభుత్వం వివిధ చట్టాలను సవరిస్తున్నదని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. శాసనమండలిలో బుధవారం నాలా చట్ట సవరణ, స్టాంపు రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణపై చర్చ జరిగిన అనంతరం మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వానికి సమాచారం లేకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వాడుకుంటే ఇప్పటివరకు కన్వర్షన్‌ చార్జీలో 50 శాతం అపరాధ రుసుం విధించేవారని, ఇకపై అది ఉండదని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు కావాలా.. వద్దా.. చెప్పండి అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు జీవన్‌రెడ్డి చట్ట సవరణపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, ఎంఎస్‌ ప్రభాకర్‌, కే నవీన్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి, బీజేపీ సభ్యుడు ఎన్‌ రాంచందర్‌రావు, కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి, టీచర్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.

నాలుగు సవరణ చట్టాలకు కౌన్సిల్‌ ఆమోదం

శాసనమండలి బుధవారం నాలుగు చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. దాదాపు 2 గంటల 40 నిమిషాలు జరిగిన కౌన్సిల్‌ సమావేశం, మంగళవారం అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. 1) జీహెచ్‌ఎంసీ అమెండ్‌మెంట్‌ బిల్లు-2020, 2) ద కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2020), 3) ది ఇండియన్‌ స్టాంప్స్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2020, 4) ద తెలంగాణ అగ్రికల్చరల్‌ లాండ్‌( కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌ అగ్రికల్చరల్‌ పర్పస్‌) నాలా అమెండ్‌మెంట్‌ బిల్లు-2020లను మండలి ఆమోదించింది.

ఉభయ సభలు నిరవధిక వాయిదా

జీహెచ్‌ఎంసీ, సీఆర్‌పీసీ, నాలా, స్టాంపులు రిజిస్ట్రేషన్‌ చట్టాల సవరణలకు మండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నాలుగు బిల్లులను ఆమోదించడానికి అసెంబ్లీ, శాసనసమండలిని ప్రత్యేకంగా సమావేశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు బిల్లులను శాసనసభ మంగళవారం ఆమోదించగా, శాసనమండలి బుధవారం ఆమోదం తెలిపింది. ఈ నాలుగు బిల్లులను ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ సహా ఎంఐఎం పార్టీలు బిల్లులను స్వాగతించి ఆమోదం తెలిపాయి. అనంతరం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. 


logo