సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 02:40:46

సమస్యల రహదారి ఎన్‌హెచ్‌-65

సమస్యల రహదారి ఎన్‌హెచ్‌-65

  • పూణె-హైదరాబాద్‌ మార్గంలో సమస్యలు పరిష్కరించాలి
  • నేషనల్‌ హైవే అథారిటీ  అధికారులతో మంత్రి వేముల 
  • ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై అధికారులతో భేటీ

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: పుణె- హైదరాబాద్‌ మధ్య 65వ నంబర్‌ జాతీయ రహదారిలో సమస్యలు పరిష్కరించాలని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు రోడ్లు, భవనాలశాఖ మం త్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. ఈ రహదారిపై పలువురు ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారంకోసం సోమవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఎన్‌హెచ్‌-65పై గల కమ్‌కోల్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులపై ఇటీవలి శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ ప్రశ్నను లేవనెత్తారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంత్రికి సూచించారు. కమ్‌కోల్‌ టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నదన్న ఫిర్యాదుపై ఎన్‌హెచ్‌ఏఐ గుల్బర్గా పీడీ స్పందిస్తూ ఈ రోడ్డుపై మరో రెండులేన్ల నిర్మాణం జరుగుతున్నదని, త్వరలోనే ఇవి పూర్తవుతాయని తెలిపారు. అలాగే దిగ్వాల్‌, అల్గోల్‌ గ్రామాల వద్ద ప్రమాదాల నివారణకు ైప్లె ఓవర్‌, వీయూపీల నిర్మించేందుకు అనుమతి లేదని తెలిపారు. దిగ్వాల్‌ గ్రామం వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ఈ గ్రామాల వద్ద వీయూపీలు, బ్లాక్‌స్పాట్స్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. సత్వార గ్రామం వద్దనున్న అతిపెద్ద మూల మలుపు దగ్గర ఐఆర్‌సీ నిబంధనల ప్రకారం రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి సూచించారు. అదేవిధంగా మల్కాపూర్‌ గ్రామం వద్ద పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎన్‌హెచ్‌ఏఐ ఆర్వో హైదరాబాద్‌ క్రిష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

హౌసింగ్‌బోర్డ్‌ ఆస్తులపై వారంలో నివేదిక: మంత్రి వేముల ఆదేశం

హౌజింగ్‌బోర్డు భూములు, ప్లాట్లు, బిల్డింగ్స్‌, ఆఫీస్‌, కమర్షియల్‌ స్థలాల వివరాలను కాలనీలవారీగా విభజించి సమగ్ర నివేదికను వారంలోగా అందజేయాలని గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్‌బోర్డు ఆస్తుల్లో నిరర్ధకమైన, ఉపయోగంలో ఉన్న ఆస్తుల వివరాలందించాలని మంత్రి వేముల సూచించారు. ఆస్తులపై కోర్టు కేసులు ఉంటే.. త్వరగా తేల్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి సమర్పిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌శర్మ, గృహ నిర్మాణ శాఖ సీఈ శ్రీనివాస్‌, సెక్రటరీఅరుణకుమారి పాల్గొన్నారు.


logo