శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 12, 2021 , 17:09:18

కామారెడ్డి, నిజామాబాద్‌లో వ్యాక్సినేష‌న్‌పై మంత్రి వేముల స‌మీక్ష‌

కామారెడ్డి, నిజామాబాద్‌లో వ్యాక్సినేష‌న్‌పై మంత్రి వేముల స‌మీక్ష‌

హైద‌రాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొవిడ్ వ్యాక్సినేష‌న్ ఏర్పాట్ల‌పై జిల్లా వైద్యారోగ్య‌శాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్ట‌రేట్‌లో జ‌రిగిన‌ సమీక్షా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత 10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్ తీసుకువ‌చ్చిన శాస్త్రవేత్తలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, అధికారులంద‌రికీ ధన్యవాదాల‌న్నారు. భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఇంత మందికి వ్యాక్సిన్ ఒకేసారి ఇవ్వడం చరిత్రలో ఇప్పటివరకు జరగలేద‌న్నారు. 

రాష్ట్రంలో 17 లక్షల మందికి, కామారెడ్డి జిల్లాలో 12 వేల మందికి మొదటి విడతలో వాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. వాక్సిన్ పంపిణీకి జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి, 60 మంది వైద్య సిబ్బందిని నియమించిన‌ట్లు తెలిపారు. జిల్లాలో 1200 వాయిల్స్ 26 కేంద్రాల్లో భద్రపరిచేందుకు అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. వ్యాక్సిన్‌పై అపోహలు వ‌ద్ద‌న్నారు. ఎవరికైనా వాక్సిన్ వికటిస్తే వారికి ఎఈఎఫ్ఐ రియాక్షన్ కిట్లను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌, సీరం ఫార్మా కోవిషీల్డ్ వాక్సిన్‌లు మాత్రమే మనం వాడుతున్న‌ట్లు తెలిపారు. 

మొదటి విడత వాక్సిన్ ఇచ్చిన 28 రోజుల తరువాత రెండవ విడత, రెండవ విడత ఇచ్చిన 14 రోజుల తరువాత మూడవ విడత వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుంద‌న్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారన్నారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడానికి అవగాహన కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ఈ కార్య‌క్ర‌మంలో భాగస్వామ్యం అవుతార‌న్నారు.