గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 02:21:24

పాలసేకరణ పెంచాలి

పాలసేకరణ పెంచాలి
  • కొత్త కేంద్రాలను ఏర్పాటుచేయండి
  • మంత్రి తలసాని ఆదేశం
  • సంచార వైద్యశాల ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విజయ డెయిరీకి ప్రభుత్వం అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తున్నా పాలసేకరణ తగ్గడంపై పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అసహనం వ్యక్తంచేశారు. గురువారం ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, డెయిరీ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. గత ఏడాది కంటే ఈసారి పాలసేకరణ 45 శాతం తగ్గడం ఆందోళనకరమన్నారు. పాలసేకరణ తగ్గడంపై వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విజయ డెయిరీలో కొందరు అధికారులు ప్రైవేట్‌ డెయిరీలకు లబ్ధిచేకూర్చేలా వ్యవహరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, ఇలాంటివారు తమ వైఖరి మార్చుకోకుంటే కఠిన చర్య లు తప్పవని మంత్రి హెచ్చరించారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీచేయలని ఆదేశించారు.


1962 నంబర్‌తో సంచార పశువైద్యశాల

గోశాలల్లోని జీవాలకు వైద్యసేవలు అం దించేందుకు సంచార పశువైద్యశాలను దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని మం త్రి తలసాని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోశాలల్లో ఉన్న జీవాలకు వైద్యసేవలు అందించేందుకు రూపొందించిన సంచార పశువైద్యశాలను (1962) మా సబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం జంతు సంక్షేమ బోర్డు (యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌) రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. 


జీవాల సంరక్షణకోసం ఏర్పాటైన యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ గత సమావేశంలో గోశాలలకు వైద్యసేవలు అందించేందుకు ఒక సంచార పశువైద్యశాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 43 గోశాలల నిర్వాహకులు ఈ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నుంచి బర్రెల్లో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీకాల పంపిణీకి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను విడుదలచేశారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో మేడారం జాతరలో 20 విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.


విజయ ఉత్పత్తులకు మంచి ఆదరణ

తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తులు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు చర్య లు చేపడుతున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. గురువారం ఆయన మాసబ్‌ట్యాంక్‌లోని విజయనగర్‌ కాలనీలో విజయ డెయిరీ 95వ పార్లర్‌ను ప్రారంభించి మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 పార్లర్లను ఏర్పాటుచేసి విజయ డెయిరీ ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటివరకు 95 పార్లర్లను ప్రారంభించామని, త్వరలో మరో 65 ప్రారంభించడంతోపాటు డెయిరీ ఉత్పత్తులను డోర్‌డెలివరీకి చర్యలు చేపడుతామని చెప్పారు. 


లాలాపేటలోని విజయ డెయిరీ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 5 లక్షల టన్నుల నుంచి 8 లక్షల టన్నులకు పెంచనున్నట్టు ప్రకటించారు. కార్యక్రమాల్లో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌, టీఎస్‌ఎల్డీఏ సీఈవో మంజువాణి, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు సభ్యుడు భగవాన్‌దాస్‌ స్వామి పాల్గొన్నారు.


logo