శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:37:52

5 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

5 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

  • 81 కోట్ల చేప, 5 కోట్ల మంచినీటి రొయ్యపిల్లలు సిద్ధం 
  • తొలుత కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌లో విడుదల
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీని ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు పశుసంవర్ధక, మత్స్య శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్లలో చేపపిల్లలను విడుదలచేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతామన్నారు. ఈ ఏడాది 24 వేల చెరువులు, రిజర్వాయర్లలో రూ. 50 కోట్ల ఖర్చుతో 81 కోట్ల చేపపిల్లలు, 78 నీటి వనరుల్లో రూ.10 కోట్లతో 5 కోట్ల మంచినీటి రొయ్య పిల్లలను విడుదల చేయనున్నట్టు వివరించారు. సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో పశుసంవర్ధక, మత్య్స, పాడిపరిశ్రమ అభివృద్ధిశాఖలపై సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్‌ ఉచిత చేపపిల్లలు, గొర్రెలు, బర్రెల పంపిణీని చేపట్టారని పేర్కొన్నారు. ఉచితచేప పిల్లల పంపిణీతో మత్య్ససంపద పెద్దఎత్తున పెరిగిందని చెప్పారు. మత్స్యకారులకు సబ్సిడీ కింద వలలు, వాహనాలు అందించామని, చేపలను ఎగుమతిచేసే స్థాయికి రాష్ట్రం చేరుకున్నదని అన్నారు. రెండో విడుత బర్రెలు, గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇన్సూరెన్స్‌ల పెండింగ్‌పై నేషనల్‌ ఇన్సూరెన్స్‌ సీఆర్‌ఎం వెంకట్రావ్‌, డీవీఎం గీతాంజలితో చర్చించి.. వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, ఏడీ రాంచందర్‌, మత్స్యశాఖ జేడీ శంకర్‌ రాథోడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo