ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:19

250 కోట్లతో మెగా డెయిరీ

250 కోట్లతో మెగా డెయిరీ

  • రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో నిర్మాణం 
  • మొబైల్‌ షాపుల ద్వారా మాంసం, చేపల విక్రయం 
  • మంత్రి తలసాని వెల్లడి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో రూ.250 కోట్లతో మెగా డెయిరీని నిర్మించనున్నట్టు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు. దీనికి శ్రావణమాసంలో శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో పశుసంవర్ధకశాఖపై ఆయన సమీక్షించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ..మెగా డెయిరీతోపాటు మామిడిపల్లిలో రూ.18.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పశు పరిశోధనకేంద్రం, పశువుల కృ త్రిమ గర్భధారణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

ఇది గొర్రెలు, పశుసంపద అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. పశువుల కృత్రిమ గర్భధారణలో జా తీయస్థాయిలో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నట్టు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన మాంసాన్ని అందించాలనే సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నగరంలో వివిధ ప్రాంతా ల్లో మాంసం దుకాణాలను ఏర్పాటుచేయాలని, మొబైల్‌ దుకాణాల ద్వారా మాంసం, చేపలు విక్రయించాలని నిర్ణయించామన్నారు. జీహెచ్‌ఎంసీలో నాణ్యమైన చేపలను అందించేందుకు 150 మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్లను ఏర్పాటుచేస్తామని చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ గొల్ల కురుమలకు 80 లక్షల గొర్రెపిల్లలను పంపిణీచేయగా, ప్రస్తుతం పిల్లలతో కలిపి గొర్రెల సంఖ్య 2 కోట్లకు చేరినట్టు చెప్పారు. ఇప్పటికే 50శాతం లబ్ధిదారులకు గొర్రెల పం పిణీ పూర్తయిందని, త్వరలోనే మిగతావారికీ పంపిణీచేస్తామని తెలిపారు. జీవాలకు దాణా, మరణించిన జీవాలకు బీమా వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, ఏడీ రామచంద ర్‌, డెయిరీ ఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


logo