సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 01:54:43

జీవో 111పై చర్చకు సిద్ధం

జీవో 111పై చర్చకు సిద్ధం
  • కాంగ్రెస్‌ నేతలకు మంత్రి తలసాని సవాల్‌
  • మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఆరోపణల్లో వాస్తవంలేదు
  • ఫాంహౌస్‌ లీజు అనంతరం ఎలాంటి నిర్మాణం జరుగలేదు

హైదరాబాద్‌/మణికొండ/ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: జీవో 111 ఉల్లంఘనలపై బహిరంగ చర్చకు సిద్ధమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కాంగ్రెస్‌ నాయకులకు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శనివారం ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. ఫాంహౌస్‌ లీజు విషయంలో మంత్రి కేటీఆర్‌ జీవో 111ను ఉల్లంఘించారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవంలేదని, ఫాంహౌస్‌ను కేటీఆర్‌ లీజుకు తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరుగలేదని స్పష్టంచేశారు. 


ఎంపీ రేవంత్‌రెడ్డి.. డ్రోన్‌ కెమెరాతో కేటీఆర్‌ ఫాంహౌస్‌ను చిత్రీకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజాసమస్యలను చర్చించాల్సిందిపోయి, కాంగ్రెస్‌ నేతలు రాజకీయ లబ్ధికోసమే చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి భూవివాదంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్షసాధింపులేదని పేర్కొన్నారు. జీవో 111ను ఎత్తివేయాలన్న డిమాండ్‌ ఉన్నదని, ఈ జీవోను పెంచి పోషించింది టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలేనని అన్నారు. 


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అరెస్టు

ఓ ప్రైవేట్‌ ఫాంహౌస్‌ ముట్టడికి యత్నించిన ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను శనివారం రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు అరెస్టుచేశారు. శంకర్‌పల్లి మండలం మేకన్‌గడ్డ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఫాంహౌస్‌ను ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డీ శ్రీధర్‌బాబు, బట్టి విక్రమార్క, టీ జయప్రకాశ్‌రెడ్డి, పోదెం వీరయ్య, అనసూయను కోకాపేటలో అదుపులోకి తీసుకొన్నారు. అక్కడ నుంచి వవారిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించాక సొంత పూచీకత్తుపై విడుదలచేసినట్టు నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ చెప్పారు.


రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు డ్రోన్‌ కెమెరాను ఎగురవేయడాన్ని సమర్థించిన కాంగ్రెస్‌ నేతలు కుంతియా, ఆజాద్‌, జీవన్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ ప్రతినిధులు సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. 


logo