మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 02:48:29

20 లక్షల కోట్లు ఏమైనయ్‌!

20 లక్షల కోట్లు ఏమైనయ్‌!

  • ఎంత మందికి లబ్ధి చేసిండ్రు
  • వలస కూలీలకు రైలు చార్జి కట్టలేదు
  • దవాఖానల దగ్గర ధర్నా చేస్తరా!
  • బీజేపీ నాయకులకు పబ్లిసిటీ పిచ్చి
  • మంత్రి తలసాని మండిపాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్లు ఎక్కడికి పోయినయ్‌..? వాటితోటి ఎంత మందికి లబ్ధి జరిగిందో చెప్పాలి’ అని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ బీజేపీ నేతలను డిమాండ్‌ చేశారు. కనీసం సొంతూళ్లకు వెళ్లే వలస కూలీల రైలుచార్జీలు సైతం కేంద్ర ప్రభుత్వం భరించలేదని గుర్తుచేశారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉండి దవాఖానల వద్ద ధర్నాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులకు పబ్లిసిటీ పిచ్చిపట్టిందని విమర్శించారు. 

కరోనా కట్టడికి బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. చప్పట్లు కొట్టించడం, దీపాలు పెట్టించడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ నాయకులను పీఎం మోదీ కట్టడి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కరోనా కట్టడికి కృషి చేస్తున్నదని, ప్రతి నిరుపేద కుటుంబానికి రూ.1,500 నగదు, ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చైనా సరిహద్దు, కరోనా విషయంలో రాజకీయాలు వద్దని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారని, అందుకే తాము ఇప్పటివరకు మాట్లాడలేదని పేర్కొన్నారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్ర కారమే ప్రభుత్వం నడుచుకుంటున్నదని వెల్లడించారు. టెస్ట్‌లసంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమెరికా నుంచి యంత్రాన్ని తెస్తుంటే దానిని పశ్చిమబెంగాల్‌కు తరలించారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ ప్రకటన, ఎత్తేయడంలో కేంద్ర ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు.

నడ్డా విమర్శించడం సరికాదు

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ప్రశంసిస్తుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శించడం సరికాదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. సమర్థవంతమైన సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ముందుకుపోతున్నదని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు సకాలంలో అందిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ కేసీఆర్‌ అడ్డా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలుసుకోవాలని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి హితవు పలికారు. 

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని, దీనిపై ఆయన ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీల్లో ఒకరు గుండు.. మరొకరు బండి అని.. వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ.. బడా జూటా పార్టీగా మారిందని, పింకీలు అని మాట్లాడుతున్న ఎంపీ .. తన తండ్రి పింకీనే అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పింకీ కడుపున పింకీయే పుడుతుందని, మంకీ కడుపున మంకీయే పుడుతుందని అరవింద్‌ ఏంటో తెలుసుకోవాలని సూచించారు. 


logo