బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 02, 2020 , 01:01:50

గొల్ల, కురుమలకు ‘మహా’ సహకారం

గొల్ల, కురుమలకు ‘మహా’ సహకారం
  • నాందేడ్‌ గొల్లగోల్వార్స్‌ యాదవసభలో మంత్రి తలసాని విజ్ఞప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాందేడ్‌లోని గొల్ల, కురుమల అభివృద్ధికి మహారాష్ట్ర సర్కార్‌ కృషిచేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కోరారు. ఆదివారం మహారాష్ట్ర నాందేడ్‌లోని న్యూమోండా మైదానంలో జరిగిన గొల్లగోల్వార్స్‌ యాదవసభలో మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. తెలంగాణలో గొల్ల, కురుమల సంక్షేమానికి సర్కార్‌  ప్రాధాన్యం కల్పిస్తూ సబ్సిడీపై గొర్రెలను పంపిణీచేసినట్టు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా యాదవ విద్యార్థులకు వసతి, సంక్షేమ భవనాల కోసం ఐదెకరాల భూమి, రూ.5 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. యాదవుల కులవృత్తిని కాపాడేందుకు వీలుగా జీవాల సంరక్షణకు, వాటివద్దకు వెళ్లి వైద్యసేవలు అందించేలా సంచార పశువైద్యశాలలను ఏర్పాటుచేశామని చెప్పారు. 


మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గొల్ల, కురుమల సంక్షేమానికి  కృషిచేయాలని ఆ రాష్ట్ర మంత్రి అశోక్‌రావ్‌ జీ చౌహాన్‌ను మంత్రి తలసాని కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో యాదవులు స్వయంసమృద్ధి సాధిస్తున్నారని ఆల్‌ యాదవ ఉమెన్స్‌ చైర్‌పర్సన్‌ బొంతు శ్రీదేవి అన్నారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.


logo
>>>>>>