బుధవారం 03 జూన్ 2020
Telangana - May 01, 2020 , 17:18:22

లైసెన్స్‌ లేని మటన్‌ షాపులపై చర్యలకు మంత్రి ఆదేశం

లైసెన్స్‌ లేని మటన్‌ షాపులపై చర్యలకు మంత్రి ఆదేశం

హైదరాబాద్‌ : నగరంలో మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, లైసెన్స్‌ లేని షాపులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. మాసాబ్‌ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. 

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. నిబంధనల ప్రకారం కొన్ని షాపుల నిర్వాహకులు శానిటైజర్లు ఉపయోగించడం లేదని, మాస్కులు ధరించడం లేదని తెలిపారు. లైసెన్స్‌ లేకుండా కొందరు షాపులు నిర్వహిస్తున్నారని, మరికొందరు ఎలాంటి అనుమతి లేకుండా రోడ్లపై మాంసం విక్రయిస్తున్నారని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి లైసెన్స్‌ లేకుండా కొనసాగుతున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఏ రోజుకు ఆ రోజు ధరలు తెలిపేవిధంగా ప్రతి షాపులో పట్టిక ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 101 షాపులను తనిఖీ చేస్తే ఇందులో 73 దుకాణాలకు లైసెన్స్‌ లేదని తేలిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే లైసెన్స్‌ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి నుంచి అలాంటి పరిస్థితులు ఉండొద్దని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మాంసం దుకాణాల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. 


logo