గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 16:24:47

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మాట‌లు హాస్యాస్ప‌దం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు.. కాంగ్రెస్ మాట‌లు హాస్యాస్ప‌దం

హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల గురించి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఎద్దెవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకునేందుకు ఆ పార్టీ రిజ‌ర్వేష‌న్లను సాకుగా చూపుతుంద‌ని విమ‌ర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీసీల‌కు 50 శాతం సీట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ నేత‌లు మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.  70 ఏళ్ల‌లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి క‌నిపించ‌లేదా? అని ప్ర‌శ్నించారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో జ‌ర‌గ‌ని అభివృద్ధిని ఈ ఆరేళ్ల‌లో చేసి చూపించామ‌ని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాం. బీసీల‌కు చ‌ట్ట స‌భ‌ల్లో రిజ‌ర్వేష‌న్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామ‌ని గుర్తు చేశారు. అసెంబ్లీ తీర్మానం కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని తెలిపారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడే కాంగ్రెస్ పార్టీకి బీసీలు గుర్తుకు వ‌స్తారు అని మండిప‌డ్డారు. బీసీల‌కు న్యాయం చేయ‌డం లేద‌ని గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన ఎన్నో కొట్లాట‌లు రాష్ర్ట ప్ర‌జ‌లంద‌రూ చూశారు. బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని పెంచిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కాంగ్రెస్ నేత‌ల మాట‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌ని మంత్రి త‌ల‌సాని స్ప‌ష్టం చేశారు.

న‌రేంద్ర మోదీపై ధ్వ‌జం

వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన హైద‌రాబాద్‌కు కేంద్రం ఇప్ప‌టికీ చేసిందేమీ లేద‌న్నారు. న‌రేంద్ర మోదీ బీహార్‌కే ప్ర‌ధానిగా అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మంత్రి ఆరోపించారు. హైద‌రాబాద్‌కు కేంద్ర బృందం వ‌చ్చినా వ‌ర‌ద సాయం మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ర్టానికి చెందిన కేంద్ర‌మంత్రి హైద‌రాబాద్‌లో రెండుసార్లు ప‌ర్య‌టించినా కూడా.. ఆయ‌న నుంచి స్పంద‌న క‌రువైంద‌న్నారు. వ‌ర‌ద బాధితుల‌ను సీఎం కేసీఆర్ ఉదారంగా ఆదుకున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లోని కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గుర్తు చేశారు.