సోమవారం 13 జూలై 2020
Telangana - Feb 04, 2020 , 01:52:25

నెరవేరుతున్న తెలంగాణ కల

నెరవేరుతున్న తెలంగాణ కల
  • ఆబ్కారీ ట్రైనీ ఎస్‌ఐల శిక్షణ శిబిరంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీళ్లు వచ్చాయి, నిధులు పెరిగాయి, నియామకాలు జరుగుతున్నాయని.. తెలంగాణ రాష్ట్ర చిరకాల స్వప్నం నెరవేరుతున్నదని ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. విజనరీ లీడర్‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ ప్రజల కల నెరవేరుతుండటం హర్షణీయమన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌ బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీలో ట్త్రెనీ ఎస్‌ఐల శిక్షణను మంత్రి ప్రారంభించి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో వానకాలం ముగియగానే ఎడారిలా మారే గోదావరి.. సీఎం కేసీఆర్‌ కృషి కారణంగా జీవనదిలా మారిందని తెలిపారు. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తవడంతో వానకాలం ముగిసినప్పటికీ తెలంగాణలో దాదాపు 350 కిలోమీటర్ల పొడవునా ఎటుచూసినా నీరు కనిపిస్తున్నదని చెప్పారు.


 సీఎం కేసీఆర్‌ పరిపాలనాదక్షతతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. మరోవైపు గుడుంబా మహమ్మారిని తరిమికొట్టి ఔషధగుణాలున్న నీరాను అందుబాటులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మట్లాడుతూ.. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేలా కొత్తగా నియమితులైన ఆబ్కారీ ఎస్‌ఐలు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆబ్కారీశాఖ కమిషనర్‌ సర్పరాజ్‌అహ్మద్‌, ఎక్స్తెజ్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎన్‌ఏ అజయ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆబ్కారీశాఖ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం డైరీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు.


logo