శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 02, 2020 , 02:20:22

మేడారం జాతరకు హెలికాప్టర్‌ ప్యాకేజీ

మేడారం జాతరకు హెలికాప్టర్‌ ప్యాకేజీ
  • ఒక్కరికి రూ.30 వేలు..ఆరుగురికి రూ.1.2 లక్షలు
  • నేడు ప్రారంభించనున్నమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ హెలికాప్టర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్‌-మేడారం-హైదరాబాద్‌గా పిలిచే ఈ ప్యాకేజీని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు బేగంపేట పాతఎయిర్‌పోర్టులో ప్రారంభించనున్నారు. ఆరుగురు ప్రయాణించేందుకు వీలుగా ఉన్న ఈ హెలికాప్టర్‌లో ఒక్కొక్కరికి టికెట్‌ రూ.30 వేలు గా.. ఆరుగురు గ్రూపుగా వస్తే రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మేడారం తీసుకెళ్లి.. దర్శనం చేయిం చి, తిరిగి హైదరాబాద్‌ తీసుకురానున్నట్టు పర్యాకాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. హెలికాప్టర్‌ ప్యాకేజీ ఎంపికచేసుకునేవారు ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.


మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్లు 

మేడారం జాతరకు వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్యరైల్వే 20 ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 4నుంచి 8వ తేదీవరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని శనివారం ప్రకటించింది. హైదరాబాద్‌-సికింద్రాబాద్‌-వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు ఉంటాయని.. ఇవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి, రాయగిరి, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని తెలిపింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-వరంగల్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య మరో 10 రైళ్లు నడుస్తాయని.. ఇవి రాలాపేట్‌, ఆసిఫాబాద్‌ రోడ్‌, రేపల్లెవాడ, రేచ్నీరోడ్‌, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, పెద్దంపేట్‌, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్‌, ఓదెల, పొత్కపల్లి, బిజిగిరి షరీఫ్‌, జమ్మికుంట, ఉప్పల్‌, హసన్‌పర్తి రోడ్‌, ఖాజీపేటటౌన్‌ స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి సాయంత్రం 3.40కు వరంగల్‌ చేరుకుంటుందని.. తిరుగు ప్రయాణంలో వరంగల్‌లో సాయంత్రం 5.45కు ప్రారంభమై రాత్రి 9.40కి హైదరాబాద్‌ చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇక సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమై ఉదయం 9.30 గంటలకు వరంగల్‌ చేరుకొని.. తిరుగు ప్రయాణంలో వరంగల్‌లో ఉదయం 11.00 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్‌ చేరుకుంటుందని తెలిపారు.


మేడారానికి పర్యాటకశాఖ బస్సు 

బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: మేడారం జాతరకు వెళ్లే పర్యాటకులు, భక్తుల కోసం పర్యాటకశాఖ ఏర్పాటుచేసిన బస్సును శనివారం టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్‌-మేడారం-హైదరాబాద్‌ ఒక్కరోజు ప్యాకేజీ టూర్‌లో భాగంగా వోల్వోబస్‌లో పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200 చార్జీగా, నాన్‌ ఏసీ హైటెక్‌ కోచ్‌కు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 చార్జీగా నిర్ణయించామని తెలిపారు. 


logo