గురువారం 28 మే 2020
Telangana - May 15, 2020 , 01:29:02

ఏపీ ఎత్తిపోతలపై ఎందాకైనా పోతాం

ఏపీ ఎత్తిపోతలపై ఎందాకైనా పోతాం

  • ఎైక్సెజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 
  • బీజేపీ, కాంగ్రెస్‌కు దమ్ముంటే ప్రధానికి లేఖ ఇవ్వాలని డిమాండ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీశైలం నుంచి ఏపీ అక్రమ ఎత్తిపోతలపై కేంద్రం ద్వారా న్యాయపోరాటం చేస్తామని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఆపేందుకు ఎంతవరకైనా వెళ్తామని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దమ్ముంటే ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. పోతిరెడ్డిపాడుకు  వైఎస్‌ఆర్‌ హయాంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలే టెంకాయ కొట్టిన విషయాన్ని మర్చిపోతున్నారని మండిపడ్డారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌తో కుమ్మక్కయ్యారంటూ ఉత్తమ్‌ మాట్లాడుతున్నారని.. సీఎం కేసీఆర్‌ కుమ్మక్కయ్యేవారే అయితే తెలంగాణ వచ్చేదికాదని స్పష్టంచేశారు. 

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని, వారిపాపం వల్లే నిర్మాణం ఆలస్యమవుతున్నదని విమర్శించారు. బీజేపీ నేతలు దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో మాట్లాడి ఏపీ ఎత్తిపోతలను అడ్డుకోవాలని, పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా తేవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు.  ప్రతిపక్షాలు పాలమూరు జిల్లాలపై రాజకీయాలు చేయవద్దని మాజీమంత్రి లక్ష్మారెడ్డి హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ విమర్శించారు. 


logo