బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:06:06

కరోనా కంటే డేంజర్‌ కాంగ్రెస్‌

కరోనా కంటే డేంజర్‌ కాంగ్రెస్‌

  • ప్రతిపక్ష నేతలకు అల్జీమర్స్‌ 
  • కేసులు ఉపసంహరించుకుంటే ఏడాదిలో ఉస్మానియాకు కొత్త భవనం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌ పార్టీ.. కరోనా వైరస్‌ కంటే డేంజర్‌ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ అభివర్ణించారు. ప్రతిపక్ష నాయకులు అల్జీమర్స్‌ వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉస్మానియా దవాఖాన గురించి వారు గతంలో ఏం మాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. గురువారం టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఉస్మానియా దవాఖాన నూతన భవనాన్ని కట్టొద్దంటూ ప్రతిపక్ష నేతలు కోర్టులో కేసులు వేశారని, ఎట్లా కడుతారో సంగతి చూస్తామని హెచ్చరించారని గుర్తుచేశారు. గత పాలకులు ఉస్మానియా దవాఖాన భవనం గురించి ఏం చేశారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏనాడైనా దవాఖానకు పోయాడా అని నిలదీశారు. 2015 లో బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నాయకులు ఉత్తమ్‌, భట్టి సహా అనేకమంది దవాఖానకు వెళ్లి కొత్త భవనాన్ని కట్టకుండా అడ్డుపడ్డారని, కేసులు వేయించారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలు వారి బినామీలతో వేయించిన కేసులను ఉపసంహరించుకొని, ఉస్మానియా దవాఖాన కొత్త భవనాన్ని కట్టాలని కోరితే.. సీఎం కేసీఆర్‌ ఏడాదిలో కట్టిస్తారని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రకటించారు. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న టీచింగ్‌ హాస్పిటల్‌ను మరో ప్రాంతంలో కట్టడానికి నిబంధనలు అంగీకరించవనే ఇంగితజ్ఞానం ప్రతిపక్షాలకు లేదని విమర్శించారు. 

అన్నింటికీ అడ్డుపడుతున్న ప్రతిపక్షాలు

కాళేశ్వరం పూర్తి కావొద్దు, సచివాలయం పూర్తి కావొద్దు, ఉస్మానియా కట్టొద్దు ఇలా అన్నింటికీ అడ్డుపడాలి, తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉండాలనేదే ప్రతిపక్షాల ఉద్దేశమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. ప్రజలు వలసలు పోవాలి, పంటలు పండొద్దు, మత కల్లోలాలు జరుగాలని భావిస్తున్నారని విమర్శించారు. అందుకే ప్రతిదానికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రజల్ని గందరగోళపరుస్తున్నాయని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ప్రతిపక్ష నేతలు వారిని భయాందోళనలకు గురిచేస్తున్నారని విమర్శించారు. బతుకుతామనుకున్న రోగులు కూడా వీరి ప్రకటనలతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు మంచి పేరు రావడాన్ని ఓర్వలేకపోతున్నారని, సైందవ పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో ఆయన సొంత నియోజకవర్గంలో 63 మంది చిన్నారులు ఆక్సిజన్‌ అందక చనిపోతే సమాధానం చెప్పుకోలేకపోయిన బీజేపీ నేతలు.. ఉస్మానియాలోకి నీళ్లొస్తే గొంతు చించుకుంటున్నారని ఆయన విమర్శించారు.


logo