మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 20:33:57

ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ పనితీరుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష

ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ పనితీరుపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష

హైదరాబాద్‌ : ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ పనితీరుపై ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో నగరంలోని రవీంద్ర భారతీలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాల్లో మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హత ఉన్న గీత వృత్తిదారులకు సభ్యత్వ కార్డులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా అబ్కారిశాఖ ఆధ్వర్యంలో తాటి, ఈత మొక్కలను నాటేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలన్నారు. అబ్కారిశాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 3 కోట్ల 52 లక్షల తాటి, ఈత మొక్కలను నాటినట్లు తెలిపారు.

టీఎఫ్‌టీ, టీసీఎస్‌ లైసెన్స్‌ల కాల పరిమితి పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. సొసైటీలకు ఇచ్చే తాటి, ఈత చెట్ల కాలపరిమితి కూడా పదేళ్లకు పెంచుతూ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌పై పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నీరా కేంద్రం పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


logo