గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 15, 2020 , 02:54:23

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం
  • అభివృద్ధినే కాంక్షించాలి: ఎర్రబెల్లి
  • మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీకే పట్టంకట్టాలి
  • మంత్రులు, ఎమ్మెల్యేల పిలుపు
  • పలుచోట్ల ఎన్నికల ప్రచారం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: టీఆర్‌ఎస్‌ సర్కార్‌ హయాంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మంగళవారం పలుచోట్ల ప్రచారం, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని, ఈ ఎన్నికల్లోనూ పునరావృతం కావడం ఖాయమన్నారు.


అభివృద్ధినే కాంక్షించాలి: ఎర్రబెల్లి


రాజకీయ జిత్తులొద్దు.. అభివృద్ధిని ఆశించాలని, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇప్పటికైనా అసత్య ప్రచారాన్ని మానుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంగళవారం సాయంత్రం మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు జరిగే అన్ని చోట్ల గులాబీ జెండా ఎగురవేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పెన్షన్ల కోసం కేంద్రం డబ్బు ఇస్తుందని బీజేపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. కేంద్రం ఏడాదికి కేవలం రూ.200 కోట్లు పింఛన్ల కోసం చెల్లిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లను లబ్ధిదారులకు ఇస్తున్నదని చెప్పారు. బీజేపీ నాయకులు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. సమావేశంలో మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గుడిపుడి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


మైనార్టీలకు అధిక ప్రాధాన్యం..

రాష్ట్రంలోని మైనార్టీలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యమిస్తున్నారని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని 14, 15వ వార్డుల్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితోకలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం చౌరస్తాలో సభలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరులోని పలు వార్డుల్లోనూ ప్రచారం చేశారు. మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన గొప్ప లీడర్‌ సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు వర్షాకాలంలో వచ్చే కప్పలాంటి వారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నదని, మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


మాయమాటలు నమ్మొద్దు..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కౌన్సిలర్‌ అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని ఐదేండ్ల కాలంలో చేసి చూయించామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పేవారిని నమ్మొద్దని మంత్రి సూచించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపల్‌ పరిధిలోని 7వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుర్రం నీరజ, 8వ వార్డులో గుర్రం మంగ తరపున ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ప్రచారం చేపట్టారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.


అవ్వా.. పింఛన్‌ వస్తుందా?

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని ఎండబెట్ల, ఉయ్యాలవాడ గ్రామాల్లోని 1, 7, 11, 12వ వార్డుల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ప్రచారం నిర్వహించారు. ఉయ్యాలవాడలో పర్యటిస్తూ వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘అవ్వా పింఛన్‌ వస్తుం దా..’ అని అడుగగా.. ‘కేసీఆర్‌ పు ణ్యమా అని బాగానే ఇస్తున్నర య్యా.. ఒక్కో నెల జర ఆలస్యంగా ఇచ్చినా పైసలు తప్పక ఇస్తున్నారు’ అంటూ బదులిచ్చారు.  


logo