ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:01

వచ్చే వానకాలం నాటికి సాగునీరిస్తం

వచ్చే వానకాలం నాటికి సాగునీరిస్తం

  • కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌  
  • ‘పాలమూరు’పై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ సమీక్ష

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కింద వచ్చే వానకాలంనాటికి సాగునీటిని అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో పాలమూరు ఎత్తిపోతల పనులను మంత్రులు తనిఖీచేశారు. అనంతరం ఏదుల రిజర్వాయర్‌ వద్ద అధికారులతో సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మొదట నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే జూన్‌ నాటికి ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ వరకు సాగునీరు అందిస్తామన్నారు. ‘పాలమూరు’ పరిధిలో 67 టీఎంసీలతో పుష్కలంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందన్నారు. ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సమైక్య పాలకులు కేవలం 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించారనీ, ప్రస్తుతం 20 టీఎంసీల నీరు నిల్వ చేసే ఆన్‌లైన్‌ రిజర్వాయర్లను  పూర్తిచేసుకుంటున్నామని వెల్లడించారు. ‘పాలమూరు’లో భాగమైన ఏదుల రిజర్వాయర్‌ పనులు 8 నెలల కిందట పూర్తయ్యాయని, కేవలం పంపులు మాత్రమే బిగించాల్సి ఉందన్నారు. నార్లాపూర్‌ రిజర్వాయర్‌ పనులు 80 శాతం, వట్టెం రిజర్వాయర్‌ 90 శాతం, ఉదందాపూర్‌ 20 శాతం, కరివెన రిజర్వాయర్‌ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.  మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని దాదాపు 80 నుంచి 90 శాతం భూములకు  ఈ పథకం ద్వారా సాగునీరు అందాల్సి ఉందన్నారు. కోర్టు కేసుల కారణంగా ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు.  ఈ సమావేశంలో సాగునీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, విప్‌లు గువ్వల బాలరాజు, కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు సీ లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌ రాజేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo