శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:35

ఫార్మాసిటీపై కుట్రలు

ఫార్మాసిటీపై కుట్రలు

  • భూసేకరణ జరుగకుండా అడ్డు
  • రాజకీయ దురుద్దేశంతో కుతంత్రం
  • యువత సహకారంతో వాటిని అధిగమిస్తున్నాం
  • మండలిలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయంగా ప్రాముఖ్యం కలిగిన హైదరాబాద్‌లో ఫార్మాసిటీని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంటే భూసేకరణ జరగకుండా కొందరు రాజకీయ దురుద్దేశంతో కుట్రలు చేస్తున్నారని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. గురువారం శాసనమండలి సమావేశంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఫార్మాసిటీకోసం చేపట్టిన భూ సేకరణకు స్థానిక నేతలు, యువత సహకరించారని, ఇప్పటివరకు తొమ్మిదివేల ఎకరాల వరకు భూసేకరణచేశామని, మరికొంత భూమి సేకరించాల్సి ఉన్నదని వివరించారు. 

భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని, నష్టపోయిన భూమికి పరిహారంగా తిరిగి భూమి ఇచ్చే యోచన లేదని స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక మేడ్చల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం పెద్ద ఎత్తున భూమిని సేకరించామని మంత్రి వెల్లడించారు. బాలానగర్‌ పారిశ్రామిక సొసైటీకి భూ కేటాయింపుపై ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన కేటీఆర్‌.. లీజుదారులను ఫ్రీ హోల్డరుగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నామని, అంతర్గత అంశాలను పరిశీలించి వారికి పూర్తి హక్కు కల్పించేలా ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. గతంలో అక్కడ 226 పరిశ్రమల యూనిట్లను నెలకొల్పేందుకు 476 ఎకరాల భూమిని కేటాయించారని, అందులో భూమి లీజు పొందినవారు ఇతరులకు అప్పగించారని, అటువంటి వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. 

డీపీఆర్‌ను అధ్యయనంచేసిన తర్వాతే పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని, ఆ భూములను పరిశ్రమలు వినియోగించుకోకపోతే వెనుకకు తీసుకుంటున్నామని మంత్రి తేల్చి చెప్పారు. ఇలా తిరిగి తీసుకున్న భూములను దళిత, గిరిజన, బీసీ, మైనార్టీలు, మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించి, వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎల్టీసీ కోసం ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నదని పేర్కొన్నా రు. ఉద్యోగి త న సర్వీసు కా లంలో ఒక్కసా రి మాత్రమే ఎల్టీసీని ఉపయోగించుకునే అవకాశమున్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

8.48 కోట్లతో మక్కా మసీదు మరమ్మతు

  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌

400 ఏండ్ల చరిత్ర కలిగిన మక్కా మసీదు మరమ్మతులపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని, పురాతన వారసత్వాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్‌ హయాంలోనే రూ.8.48 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టామని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన మంత్రి.. మైనార్టీ శాఖ నిధులను ఆర్కియాలజీ విభాగానికి బదలాయించామని, ఆ శాఖ ఆధ్వర్యంలోనే బెంగళూరుకు చెందిన కాంట్రాక్టు సంస్థకు మక్కా మసీదు మరమ్మతు పనులు అప్పగించామన్నారు. ఇప్పటికే 75% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఫాస్టాగ్‌ విధానంపై ఎమ్మెల్సీ మహ్మద్‌ నసీరుద్దీన్‌ అడిగిన ప్రశ్నకు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. నేషనల్‌ హైవే అథారిటీ పరిధిలో వాహనదారులకు సౌకర్యంగా ఉండేలా ఈ విధానం అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్‌హెచ్‌ 65కు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న టోల్‌గేట్‌ వద్ద ప్రస్తుతం ఇరువైపులా నాలుగు లేన్లు ఉన్నాయని, మరో రెండు లేన్లు, అదేవిధంగా అంబులెన్సులు, వీఐపీల వాహనాలు వెళ్లేందుకు ప్రత్యేక లేన్‌ను కూడా ఏర్పాటుచేసేలా సంబంధిత విభాగాలకు సూచిస్తామన్నారు. అనంతరం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచన మేరకు ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, రాంచందర్‌రావు, నర్సిరెడ్డి, జీవన్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి ఇతర సభ్యులు స్పెషల్‌ మెన్షన్స్‌, పిటిషన్లను సమర్పించారు.

ఎల్టీసీ కోసం బడ్జెట్‌లో కేటాయింపులు

సంవత్సరం
(రూ. కోట్లలో)
2014-15
125.25
2015-16
163.77 
2016-17
235.38
2017-18
235.28
2018-19 
128.95 
2019-20
232.95 


logo